Site icon HashtagU Telugu

Telanganas Power Games : తెలంగాణ ‘పవర్’ గేమ్స్: ఏఐసీసీ అనూహ్య నిర్ణయం, బీజేపీ బీసీ వ్యూహం, ‘సున్నా బిల్లు’ షాక్

Telanganas Power Games Aicc Drama Bjp Bc Strategy Zero Power Bill

ఏఐసీసీ అనూహ్య నిర్ణయం.. భూపేశ్ బఘేల్‌ను తెలంగాణ ఇంఛార్జిగా ఎందుకు నియమించలేదు ? మీనాక్షి నటరాజన్ ఎవరు?

Telanganas Power Games : తెలంగాణ కాంగ్రెస్‌కు నూతన ఏఐసీసీ ఇంఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియమితులు అయ్యారు. దీపాదాస్ మున్షీ స్థానంలో ఆమె ఈ బాధ్యతలను చేపట్టారు. అయితే ఈ పోస్టుకు పరిశీలించిన మొదటి పేరు మీనాక్షిది కాదు. తెలంగాణ ఇంఛార్జి పోస్టు కోసం ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్  పేరును కాంగ్రెస్ హైకమాండ్ తొలుత పరిశీలించింది.  ఈవిషయంపై కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు పలుమార్లు చర్చించారు. బఘేల్‌కు తెలంగాణ పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆరా తీశారు. ఈవిషయం భూపేశ్ బఘేల్  టీమ్‌కు కూడా తెలుసు. అంతేకాదు, గతేడాది బఘేల్ సన్నిహితులు పలువురు హైదరాబాద్‌లో రహస్యంగా పర్యటించారు. తెలంగాణలోని రాజకీయ పరిస్థితుల గురించి వారు ఆరా తీశారు. తెలంగాణ కాంగ్రెస్ నిర్మాణ స్వరూపం, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు పనితీరు, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వ శైలితో ముడిపడిన వివరాలన్నీ సేకరించారు. దీనిపై నివేదికలు తయారు చేసి ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్‌కు పంపారు.

Also Read :Secunderabad Railway Station: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌‌లోని ఐకానిక్ ఆర్చ్‌లు ఇక కనిపించవు.. ఎందుకంటే..

అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం గతవారం కొత్త నిర్ణయం తీసుకుంది. భూపేష్ బఘేల్‌కు పార్టీలో మరింత అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో, ఆయనను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్ రాష్ట్రానికి ఇంఛార్జిగా భూపేష్ బఘేల్‌‌ను నియమించింది. దీంతో, తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జిగా మీనాక్షి నటరాజన్‌ ఎంపికయ్యారు.

మీనాక్షి నటరాజన్‌ మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకురాలు. రాజీవ్ గాంధీ ట్రస్ట్‌లో ఆమె ట్రైనింగ్ తీసుకున్నారు. రాహుల్ గాంధీకి అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. 2009లో మధ్యప్రదేశ్‌లోని మండ్సోర్ నుంచి ఎంపీగా గెలిచారు. అయితే, 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వీచిన మోదీ వేవ్‌లో ఓడిపోయారు. ఆమెకు కాంగ్రెస్ పార్టీ పాలనా వ్యవస్థపై మంచి అవగాహన ఉంది. బలమైన కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్న నేతగా మీనాక్షికి పేరుంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో బలమైన వర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలంతా రేవంత్ రెడ్డి వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.  ఈ సంక్లిష్ట రాజకీయ సమీకరణాల నడుమ మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్‌ను సమర్థంగా నడిపించగలరా? ఈ నియామకం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతవరకు దోహదపడుతుందో వేచి చూడాలి.

Also Read :Ganga Tiger : గంగానదిలో పెద్దపులులు.. ఏమిటివి ? వాటికి ఏమవుతోంది ?

బీసీ రిజర్వేషన్లతో రాజకీయ క్రీడ : కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ వర్సెస్ బీజేపీ కౌంటర్

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల ఫోకస్ ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల‌పై ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రతీ పార్టీ ఈ అంశంపై మాట్లాడుతూ.. తమకు బీసీల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. దీనిపై  కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టమైన ప్రణాళికను రెడీ చేసుకుంది. ఫిబ్రవరి 28 నాటికి రెండో దశ కుల గణనను పూర్తి చేయాలని తొలుత లక్ష్యంగా పెట్టుకుంది.  ఈ లక్ష్యాన్ని ఆ తర్వాత సవరించుకుంది.  మార్చి 15లోగా రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ సర్కారు యోచిస్తోంది.  ఇదంతా కేవలం తొలి అంకమే. తదుపరి అంకంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగి కీలక పాత్ర పోషించనున్నారు.

కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం.. తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన వెంటనే రాహుల్‌గాంధీ నేతృత్వంలో 100 మంది కాంగ్రెస్ ఎంపీలు, సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర నేతలు దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. చివరగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి బీసీ రిజర్వేషన్‌ను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని వారు విజ్ఞప్తి చేయనున్నారు. తెలంగాణ బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేరిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని రిజర్వేషన్ల తరహాలో వాటికి చట్టపరమైన రక్షణ లభిస్తుంది. దీనివల్ల కోర్టు కేసులు ఎదురైనా ఈ రిజర్వేషన్ల అమలుకు బ్రేక్ పడదు.  ఈ వ్యూహంతో బీసీ వర్గాల మద్దతును సంపాదించొచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

మరోవైపు బీజేపీకి ప్రత్యేకమైన ప్లాన్ ఉంది.  బీజేపీ వర్గాల కథనం ప్రకారం.. కాంగ్రెస్ ప్లాన్‌ను బీజేపీ ముందే అంచనా వేసింది. కాంగ్రెస్ సర్కారు తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపితే, తాము దాన్ని తిప్పి పంపే అవకాశం లేదని అర్థం చేసుకుంది. అందుకే బీజేపీ ఇప్పటి నుంచే తెలంగాణలోని బీసీ వర్గాలకు దగ్గరవుతోంది. రిజర్వేషన్ అంశాన్ని తమదైన శైలిలో ముందుకు తీసుకెళ్తోంది. కేంద్ర మంత్రి పదవుల కేటాయింపులో బీసీ నేతలకు మోడీ సర్కారు ఇస్తున్న ప్రాధాన్యం గురించి తెలంగాణ ప్రజలకు తెలియజేసేందుకు బీజేపీ రెడీ అవుతోంది. దశాబ్దాల తరబడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమయంలో బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు గుర్తుకు రాలేదు ? అని కాంగ్రెస్‌ను ప్రశ్నించేందుకు బీజేపీ సమాయత్తం అవుతోంది.

ఒకవేళ కాంగ్రెస్ వ్యూహం పనిచేస్తే.. బీజేపీకి తెలంగాణలో బీసీ ఓటు బ్యాంక్ దూరమయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో, బీజేపీ దీనికి ప్రత్యామ్నాయంగా బీసీలకు మరిన్ని ప్రత్యేక ప్రయోజనాలను ప్రకటించే యోచనలో ఉంది. అందుకే, ఈ బీసీ రిజర్వేషన్ దౌత్యయుద్ధం మరింత ఆసక్తికరంగా మారనుంది. ఈ ఆటలో చివరికి ఎవరు గెలుస్తారు అనేది వేచి చూడాలి. ఏదిఏమైనా బీసీ ఓటుబ్యాంకు కోసం కాంగ్రెస్, బీజేపీ మధ్య  రాజకీయ పోరు మరిన్ని మలుపులు తిరగడం ఖాయం!

గృహజ్యోతి : ‘సున్నా’ బిల్లు పాచిక.. కాంగ్రెస్ సర్కారుకు ‘వేసవి’ చిక్కులు

వేసవి సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణలోని  కాంగ్రెస్ సర్కారు అమలుచేస్తున్న గృహజ్యోతి పథకంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఉచిత విద్యుత్ అనేది వినిపించుకోవడానికి చక్కగా ఉంటుంది. వేసవిలో ప్రజల విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిపోతుంది.  ప్రతీ ఇంట్లో ఎయిర్ కండీషనర్లు, కూలర్లు, ఇతర విద్యుత్ పరికరాలను అధికంగా ఉపయోగిస్తారు. 2025 జనవరి నాటికి తెలంగాణలో మొత్తం 50,16,798 మంది గృహజ్యోతి పథకం లబ్ధిదారులు ఉన్నారు. వారిలో 48,89,890 కుటుంబాలకు ఏకంగా సున్నా (₹0) విద్యుత్ బిల్లు జారీ అయ్యింది. అమల్లోకి తెచ్చిన తొలినాళ్లలో ఈ పథకం కాంగ్రెస్‌ పార్టీకి ఒక తెలివైన రాజకీయ పథకంలా కనిపించింది. అయితే తెలంగాణ విద్యుత్ శాఖ అంచనాలను మించిన రేంజులో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరిగిపోయింది.

ఉచిత విద్యుత్ అంటే ఎంత వాడినా ఖర్చు ఉండదు.. అందుకే ప్రజలు పూర్తి స్థాయిలో విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. ఒకప్పుడు నెలకు 70-80 యూనిట్లు వినియోగించిన ఇళ్లలో ఇప్పుడు గరిష్ఠంగా 200 యూనిట్ల దాకా విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఇప్పుడు అన్ని గదుల్లో ఫ్యాన్‌లు, టీవీలు, లైట్లు నిరంతరం ఆన్‌లో ఉంచుతున్నారు. వాషింగ్ మెషీన్లు నాన్‌స్టాప్ గా పనిచేస్తున్నాయి. ఇంట్లోని బట్టలతో పాటు పక్కింటి బట్టలను కూడా ఉతుకుతున్నారా అనే  రేంజులో వాషింగ్ మెషీన్లను వినియోగిస్తున్నారు.

అయితే అసలు కథ ఇప్పుడే మొదలవుతోంది. వేసవి రాగానే, విద్యుత్ డిమాండ్ పెరగడం అనేది సర్వసాధారణం. ఎయిర్ కండీషనర్లు, కూలర్లను ఎక్కువసేపు వాడుతుంటారు. సమస్య ఏమిటంటే.. నెలవారీ విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటితే, ఉచిత విద్యుత్ స్కీం వర్తించదు. విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటితే మాత్రం, మొత్తం బిల్లును చెల్లించాల్సి ఉంటుంది.

విద్యుత్ శాఖ ఇప్పటికే ఈ స్కీంపై ఆలోచనలో పడింది. ఎక్కువ విద్యుత్ వినియోగం వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పెరుగుతోంది. దీంతో విద్యుత్ సరఫరా పద్ధతుల్లో మార్పులు చేసే దిశగా అధికారులు యోచిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలంటే, వేసవిలో అదనపు విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం కావాలి. లేదంటే, ప్రజల ₹0 బిల్లు నెమ్మదిగా రాష్ట్ర సర్కారుకు పెద్ద ముప్పుగా మారే ఛాన్స్ ఉంది.

ఇప్పటివరకు ఓటర్లను ఆకట్టుకుంటున్న ఈ పథకం,  వేసవి సీజన్ ముగిసే నాటికి తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ సర్కారు ఈ “₹0 బిల్లు గ్యాంబుల్”ని విజయవంతంగా నడిపించగలదా? లేదంటే, వేసవి ముగిసే సరికి ప్రజల నుంచి విమర్శలను  ఎదుర్కొంటుందా ? వేచిచూడాలి.