Tourism village award: తెలంగాణ పల్లెకు అంతర్జాతీయ గుర్తింపు!

తెలంగాణ‌ రాష్ట్రానికి మ‌రోసారి ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది.

  • Written By:
  • Updated On - November 17, 2021 / 11:06 AM IST

తెలంగాణ‌ రాష్ట్రానికి మ‌రోసారి ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. ఐక్య‌రాజ్య స‌మితికి అనుబంధంగా ఉన్న ప్ర‌పంచ ప‌ర్యాట‌క సంస్థ యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని భూదాన్ పోచంప‌ల్లి గ్రామాన్ని ఉత్త‌మ ప్ర‌పంచ ప‌ర్యాట‌క గ్రామంగా గుర్తించింది. డిసెంబర్ 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సులో ఈ అవార్డును అందజేయనున్నారు.

ఈ అరుదైన గుర్తింపు కోసం ఇండియా నుండి మూడు గ్రామాలు పోటీ పడ్డాయి. చివరికి
భూదాన్ పోచంప‌ల్లి గ్రామాన్ని అదృష్టం వరించింది. ఈ నేలపై జరిగిన భూదానోద్య‌మంతో పోచంప‌ల్లి గ్రామం పేరు భూదాన్ పోచంప‌ల్లిగా మారింది. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పోచంప‌ల్లి పేరు సంపాదించింది. ఇక్కడ తయారుచేసే ఇక్క‌త్ చీర‌ల‌కు అంత‌ర్జాతీయ గుర్తింపు ఉంది.

పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు రావడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సాంస్కృతిక నేపధ్యాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని, స్వయంపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ ఫలితంగా, తెలంగాణ చారిత్రక పర్యాటక ప్రాంతాలు అంతర్జాతీయ గుర్తింపును సాధిస్తున్నాయని సీఎం తెలిపారు.

ఈ ఘనత పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మనిర్బర్ భారత్ లో భాగంగా మోదీ ఇచ్చిన వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమంతో ప్రపంచదేశాలు ఇండియాలోని గ్రామాలవైపు చూస్తున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు.

Also Read: విమాన ప్ర‌యాణ ఎత్తును పెంచుతోన్న వాతావ‌ర‌ణ మార్పులు