First Govt Engineering College : తెలంగాణలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు కాబోతోంది. ఎక్కడో తెలుసా ? సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో!! కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజినీరింగ్ కాలేజీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాలేజీని అప్‌గ్రేడ్ చేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచి ఈ కాలేజీలో క్లాసులు ప్రారంభమవుతాయి. ఈ కాలేజీలో మొత్తం 180 సీట్లలో బీటెక్ సీఎస్‌ఈ, సీఎస్‌ఈ (ఏఐ అండ్ ఎంఎల్), సీఎస్‌ఈ (డాటా సైన్స్) కోర్సులను ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణలో ప్రస్తుతం ఇంజినీరింగ్ కాలేజీలన్నీ యూనివర్సిటీల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. కోస్గి కళాశాల మాత్రం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో పని చేయనుంది. మౌలిక వసతుల కల్పన, బోధన, బోధనేతనర సిబ్బంది నియామకం, వేతనాలు వంటి వ్యవహారాలన్నీ నేరుగా సాంకేతిక శాఖే పర్యవేక్షిస్తుంది. సిలబస్ రూపకల్పన, పరీక్షల నిర్వహణ, సర్టిఫికెట్ల జారీ కోసం ఇంజినీరింగ్ కాలేజీ ఏదో ఒక యూనివర్సిటీకి అనుబంధంగా ఉండాలి. అందుకే కోస్గి ఇంజినీరింగ్ కాలేజీని జేఎన్‌టీయూకు అనుబంధంగా నిర్వహిస్తారు. ఇంజినీరింగ్ కాలేజీగా(First Govt Engineering College) అప్‌గ్రేడ్ అయినా ప్రస్తుతమున్న పాలిటెక్నిక్ కోర్సులను కూడా యథాతథంగా అందిస్తారు. ఐదు ఎకరాల్లో ఉన్న కోస్గి పాలిటెక్నిక్ కాలేజీని 2014 సంవత్సరంలో ప్రారంభించారు. ఇక్కడ మొత్తం 180 డిప్లొమా సీట్లతో సివిల్, మెకానికల్, ఈసీఈ బ్రాంచీలు ఉన్నాయి. వీటికి అదనంగా ఇప్పుడు బీటెక్ బ్రాంచీలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం పాలిటెక్నిక్ కోర్సులకు ఉన్న అధ్యాపకులు సరిపోతారని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. ఇటీవలే అక్కడ ఒక హాస్టల్ కూడా అందుబాటులోకి వచ్చింది.
Also Read: Ayodhya Ram Ornaments : అయోధ్య రామయ్య ఆభరణాల జాబితా ఇదీ..
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఈ ప్రాంత రూపురేఖలు మారబోతున్నాయి. కొడంగల్ అభివృద్ధి కోసం కడా (కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ)ను ఏర్పాటు చేశారు. కొడంగల్, కోస్గి ఆస్పత్రులను 100 పడకలుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. గురుకులాలు, పాఠశాలలకు ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తున్నారు. జీఓ 69తో కొడంగల్, నారాయణపేట, మక్తల నియోజకవర్గాలకు సాగునీరు అందించనున్నారు. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. కొడంగల్‌ను రెవెన్యూ డివిజన్‌గా, మద్దూరును మున్సిపల్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నారు. వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్‌కు లైన్ క్లియర్ కానుంది. నియోజకవర్గానికి వ్యవసాయ డిప్లమో కళాశాల, 50 ఎకరాల్లో ఉద్యానవన పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు. కొడంగల్ బస్టాండ్ విస్తరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.