Telangana Yoga Day: గచ్చిబౌలిలో జూన్ 21న యోగా డే వేడుకలు, 5500 మందితో భారీ నిర్వహణ

యోగా డే ఏర్పాట్లపై ఆయుష్ శాఖ అధికారులతో సమీక్షించిన మంత్రి, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Yoga Day

Yoga Day

హైదరాబాద్: (Telangana Yoga Day): హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా (జూన్ 21) వేడుకలు ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.

యోగా డే ఏర్పాట్లపై ఆయుష్ శాఖ అధికారులతో సమీక్షించిన మంత్రి, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్ శాఖకు చెందిన యోగ శిక్షకులు, మెడికల్ విద్యార్థులు మరియు వివిధ పాఠశాలలకు చెందిన 5500 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. పాల్గొనే వారందరికీ ఉదయం అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, మేయర్ విజయలక్ష్మి సహా అనేకమంది ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యవంతమైన జీవనశైలికి ప్రాధాన్యత ఇస్తూ యోగా వంటి ప్రాచీన శాస్త్రాలను ప్రోత్సహిస్తోందని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఈ యోగా వేడుకల ద్వారా యువతలో ఆరోగ్య చైతన్యం పెరిగేలా చూడడం లక్ష్యమని పేర్కొన్నారు.

  Last Updated: 21 Jun 2025, 08:24 AM IST