Womens Commission Notices: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి (KTR) తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు పంపించింది. ఉచిత బస్సు ప్రయాణం పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, మహిళలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”బస్సుల్లో అల్లం, వెల్లిపాయాలు గిల్లుకుంటే తప్పేముందని మంత్రి సీతక్క అంటున్నారు. బస్సుల్లో మహిళలు కొట్టుకుంటుంటే సీతక్కకి కనబడడం లేదా? అని ప్రశ్నించారు. బస్సులు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బస్సులు పెంచిన తర్వాత అవసరమైతే బ్రేక్ డాన్స్, రికార్డింగ్ డాన్స్‌లు వేసుకోమనండి.. మాకేంటి” అని అన్నారు. ప్రస్తుతం ఈ విషయం పై పలువురు కాంగ్రెస్ మహిళా నేతలు విమర్శించారు. మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో తాజాగా కేటీఆర్ కి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 24, 2024న మహిళా కమిషన్ కార్యాలయం వద్ద హాజరుకావాలని ఆదేశించింది.
మరోవైపు తన వ్యాఖ్యలపై కేటీఆర్ వివరణ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై కేటీఆర్ స్పందించారు. నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగినట్లయితే విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కాచెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు అని ట్వీట్ చేశారు.