Women Security : కొందరు ప్రవాస అల్లుళ్లు అనైతికంగా ప్రవర్తిస్తున్నారు. పెళ్లయ్యాక భార్యలను వదిలేసి విదేశాల్లో సెటిల్ అయిపోతున్నారు. తెలంగాణ పరిధిలోని కొన్ని ప్రవాస అల్లుళ్ల కుటుంబాలు గృహహింసకు పాల్పడుతున్నాయి. ఈవిధమైన కేసుల్లో బాధిత మహిళలకు తెలంగాణ మహిళా భద్రతా విభాగానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ సెల్ అండగా నిలుస్తోంది. తగిన న్యాయ సహాయం చేస్తోంది. గృహహింసను ఎదుర్కొంటున్న బాధితురాళ్లు విదేశాల్లో ఉంటే.. వారి కుటుంబ సభ్యులు ఇక్కడ నమోదు చేస్తున్న ఫిర్యాదుల పరిష్కారానికి ఎన్‌ఆర్‌ఐ సెల్ చేయూత అందిస్తోంది.
Also Read :Trump Vs Kamala : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం ఎప్పుడు..?
2019లో ఏర్పాటైన ఎన్‌ఆర్‌ఐ సెల్‌లో ఇప్పటివరకు దాదాపు 463 కేసులు(Women Security) నమోదయ్యాయి. వాటిల్లో 153 కేసులను పరిష్కరించారు. 53 కేసుల్లో ప్రవాస అల్లుళ్లను విదేశాల నుంచి భారత్‌కు రప్పించి కోర్టుల ఎదుట హాజరు పరిచారు. తెలంగాణలోని 23 మహిళా పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తులో స్థానిక పోలీసులకు ఎన్‌ఆర్ఐ సెల్ సహకరిస్తోంది. ప్రవాస అల్లుళ్లు పనిచేస్తున్న కంపెనీల ద్వారా వారిపై ఒత్తిడిని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. కేసుల విచారణకు సహకరించకుండా విదేశాల్లో ఉండిపోయిన ప్రవాస అల్లుళ్లపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేస్తోంది. వారి పాస్‌పోర్టులను రద్దు చేయిస్తోంది.
Also Read :Aurobindo : ‘అరబిందో’ ఔట్.. 108, 104 సర్వీసుల నిర్వహణకు గుడ్‌బై ?
వారిని తెలంగాణకు రప్పించాక.. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్(సీడీఈడబ్ల్యూ) సంస్థ నిపుణులతో కౌన్సెలింగ్ చేయిస్తోంది. కాపురాలను నిలపడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. తెలంగాణ మహిళా భద్రత విభాగం ఎన్‌ఆర్‌ఐ సెల్‌ను బాధితులు నేరుగా సంప్రదించవచ్చు. దీని వాట్సాప్ నంబరు +91 8712656858. ఫోన్ నంబరు 040 27852246. tsnricell.wsw @gmail.com అనే మెయిల్ ఐడీకి ఫిర్యాదును పంపొచ్చు. మరో మెయిల్ ఐడీ nricell-ts-wsw@tspolice.gov.inకు కూడా ఫిర్యాదులు పంపొచ్చు. యూట్యూబ్‌లో Women Safety Wing, Telangana Police అని టైప్ చేస్తే వీడియోలు వస్తాయి. వాటిని చూసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.