Site icon HashtagU Telugu

Sandhya Reddy Karri: ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్‌గా తెలంగాణ మహిళ

Medium 2023 09 07 82777a87f9

Medium 2023 09 07 82777a87f9

ఆకాశంలో సగం, అవకాశాల్లోనూ సగం అని నిరూపించుకుంటున్నారు మన తెలంగాణ మహిళలు. అంతేకాదు మనదేశంలోనే కాకుండా, విదేశాల్లో సత్తా చాటుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలో తెలంగాణకు చెందిన మహిళ అరుదైన ఘనతను సాధించారు. న్యూసౌత్‌ వేల్స్‌ రాష్ట్రం సిడ్నీ నగరంలోని స్ట్రాత్‌ఫీల్డ్‌ పురపాలక సంఘం డిప్యూటీ మేయర్‌గా తొలిసారిగా తెలుగు మహిళ కర్రి సంధ్యారెడ్డి (శాండీరెడ్డి) ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సంతతి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌కు చెందిన పట్లోళ్ల శంకర్‌రెడ్డి, సారారెడ్డి కుమార్తె సంధ్యారెడ్డి. ఖైరతాబాద్‌లోనే ఆమె స్టాన్లీ కాలేజ్‌లో ఇంటర్మీడియట్‌ వరకు చదివారు. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో న్యాయవాద పట్టా పొందారు.

ఉస్మానియాలో ఎంఏ చేశారు. 1991లో కర్రి బుచ్చి రెడ్డి అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగితో సంధ్యారెడ్డి వివాహం జరిగింది. పెళ్లి అయ్యాక సంధ్యారెడ్డి భర్తతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లారు. అక్కడి ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయంలో మైగ్రేషన్‌ లా డిగ్రీ పొందారు సంధ్యారెడ్డి. ఆ తర్వాత ఆమె ఇమ్మిగ్రేషన్ న్యాయవాదిగా పనిచేశారు. స్థానికంగా భర్తతో కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె చొరవతో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కాంస్య విగ్రహం స్ట్రాత్‌ఫీల్డ్‌లోని హోమ్‌బుష్‌ కమ్యూనిటీలో ఏర్పాటు చేశారు.

ఈ అవకాశం తనకు దక్కడం మీద సంధ్యారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సంధ్యా రెడ్డికి నీల్ రెడ్డి, నిఖిల్ రెడ్డి అని ఇద్దరు కుమారులున్నారు. వీరిలో నిఖిల్ ఆస్ట్రేలియా జాతీయ చదరంగం ఛాంపియన్ గా ఈ ఏడు గెలిచాడు. ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళా శక్తిని చాటిన సంధ్యారెడ్డికి బీఆర్ఎస్ ప్రవాస విభాగం సమన్వయకర్త బిగాల మహేష్, ఇతర నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కావడం పట్ల తెలంగాణ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Mahesh Babu: యూట్యూబ్ రికార్డులను బద్దలు కొట్టిన మహేశ్, శ్రీమంతుడు మూవీకి 200 M+ వ్యూస్