Site icon HashtagU Telugu

TS Unemployment : ఇంటికో ‘ఉత్తుత్తి’ ఉద్యోగం

`ఇంటికో ఉద్యోగం ఇస్తాన‌ని ఎక్క‌డ చెప్పినా…చూపించు..సాధ్య‌మ‌వుత‌దా..ప్ర‌పంచ‌డంలో ఎక్క‌డైనా ఉందా ..ఇంటికో ఉద్యోగం ఇచ్చే ప్ర‌భుత్వం..` అంటూ మీడియాను ఇటీవ‌ల తెలంగాణ‌ సీఎం కేసీఆర్ నిల‌దీశాడు. కానీ, ఉద్య‌మ స‌మ‌యంలో ఆయ‌న ఇంటికో ఉద్యోగం తెలంగాణ వ‌స్తే వ‌స్తద‌ని చెప్పిన విష‌యాన్ని నిరుద్యోగులు గుర్తు చేస్తున్నారు. ప్ర‌త్యేక తెలంగాణ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఉద్యోగాలు లేక యువ‌త అల్లాడుతోంది. పైగా ఏడేళ్లుగా డీఎస్సీ ని తెలంగాణ స‌ర్కార్ ప్ర‌క‌టించ‌లేదు. నిరుద్యోగ స‌మ‌స్య రాష్ట్రంలో పెరిగి పోయింది.ప్ర‌తి రాజ‌కీయ పార్టీకి నిరుద్యోగ స‌మ‌స్య ఒక అస్త్రంగా మారింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో అదే అస్త్రాన్ని యువ‌త ఓట్ల కోసం ప్ర‌యోగిస్తున్నారు. ప్ర‌త్యేక తెలంగాణ సాధించ‌డానికి ఉప‌యోగ‌ప‌డిన నిరుద్యోగ అస్త్రం ఇప్పుడు అధికారంలోకి రావ‌డానికి రాజ‌కీయ పార్టీల‌కు ఆయుధంగా ఉంది. నిరుద్యోగ సమస్య ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్ష పార్టీలకు శక్తివంతమైన స్లోగ‌న్ గా కొనసాగుతోంది. తెలంగాణ కూడా దీనికి మినహాయింపు కాదు. నిజానికి, ఆంధ్రా పాలకుల నుండి ఈ ప్రాంతాన్ని విముక్తి చేయడం ద్వారా నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా లేకుండా చేయాల‌ని ఉద్య‌మించారు. తీరా, ప్ర‌త్యేక రాష్ట్రం వ‌చ్చిన త‌రువాత నిరుద్యోగ స‌మ‌స్య ఇంకా పెరిగింది.

తెలంగాణ ఉద్యమానికి మూలస్తంభాలలో ఒకటి నిరుద్యోగ స‌మ‌స్య‌. అయితే రాష్ట్ర విభజనకు ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా ఆ సమస్య అలాగే ఉంది. తెలంగాణ ఏర్పాటైన వెంటనే 1.07 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చాడు. కానీ అందులో 70,000 మాత్రమే భర్తీ చేశాడు.ఇంకా ప్రభుత్వంలో కనీసం 1.91 లక్షల ఖాళీలు ఉన్నాయని ప్రతిపక్షాలు చెబుతున్న మాట‌. యువత ముందు నిరుద్యోగ భృతి అనే ఎన్నిక‌ల అస్త్రాన్ని చూపించ‌డం మిన‌హా అమ‌లుకు నోచుకోలేదు.ఇటీవల తెలంగాణ కేబినెట్ మంత్రి కెటి రామారావు అసెంబ్లీలో మాట్లాడుతూ భారతదేశంలో లేదా బయట ఏ ప్రభుత్వం కూడా 5% కంటే ఎక్కువ మంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేదని తేల్చాశాడు. అందుకే రాష్ట్రం పెట్టుబడులను ఆహ్వానిస్తోంద‌ని చెప్పాడు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోన్న బీజేపీకి దేశ వ్యాప్తంగా పెరిగిన నిరుద్యోగం గురించి చెప్పాల‌ని నిల‌దీశాడు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసిన మోడీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో చెప్పాల‌ని ప్ర‌శ్నించాడు.నిరుద్యోగం విష‌యంలో రాష్ట్రం, కేంద్రం పరస్పరం విమ‌ర్శించుకోవ‌డం మానుకుని స‌మ‌న్వ‌యంగా పని చేయాలి. సున్నిత‌మైన ఉద్యోగ స‌మ‌స్య‌ను ప‌రిష్కారించాలంటే ప్రైవేటు కంపెనీల‌ను ఇబ్బుడిముబ్బిడిగా తీసుకురావాలి. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం అసాధ్యం కాద‌ని ప్ర‌భుత్వాలు చెబుతున్న క్ర‌మంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడమే ఏకైక పరిష్కారం. ఆ విధంగానైన ప్ర‌య‌త్నం చేయ‌క‌పోతే, రాబోవు రోజుల్లో నిరుద్యోగ స‌మ‌స్య మ‌రింత పెరిగే ప్ర‌మాదం ఉంది. ఫ‌లితంగా స‌మాజంలో అస‌హ‌నం, అస‌మాన‌త‌లు చోటుచేసుకోనే అవ‌కాశం లేక‌పోలేదు.