Site icon HashtagU Telugu

Telangana Unemployed Youth: నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రూ. 3 ల‌క్ష‌ల సాయం!

Bhatti

Bhatti

Telangana Unemployed Youth: రాజీవ్ యువ వికాసం ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు (Telangana Unemployed Youth) రూ.6 వేల కోట్లతో ఐదు లక్షల మందికి స్వయం ఉపాధి పథకాలు అందిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ వీర వనిత చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు.  యువత వికాసం గురించి గత బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదని, ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించి వారి అభ్యున్నతికి దోహదపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా వివరించారు.‌ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల నిరుద్యోగ యువతీ యువకులు స్వయం ఉపాధి పథకాలు అందకపోవడంతో ఇబ్బందులు పడ్డారని వివరించారు.‌

ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా యువతకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ. 3 లక్షల చొప్పున సాయం చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించారు. 5 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఈ సంవత్సరం స్వయం ఉపాధి పథకం అందించడానికి ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. స్వయం ఉపాధి పథకం కొరకు ఆన్ లైన్ లో ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 02న స్వయం ఉపాధి పథకాలకు ఎంపికైన లబ్ధిదారులకు మంజూరి పత్రాలను అందజేస్తామని వివరించారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి తగిన మార్గదర్శకాలను అధికారులు రూపొందిస్తున్నారని చెప్పారు. సామాజిక స్పృహ కలిగిన ప్రజా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించడం సామాజిక బాధ్యతగా తీసుకున్నదన్నారు.

Also Read: LENOVO : టెక్ ప్రియులకు గుడ్ న్యూస్..LENOVO నుంచి ఫ్లిప్ లాప్టాప్

చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి రూ. 540 కోట్లు

వీరవనిత చాకలి ఐలమ్మ యూనివర్సిటీ నిర్మాణానికి ప్రజా ప్రభుత్వం 540 కోట్ల రూపాయలు కేటాయించిందని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి అద్భుతమైన నిర్మాణాలు చేయడానికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసిందని ఈ సందర్భంగా తెలిపారు. యూనివర్సిటీలో ఉన్న హెరిటేజ్ భవనాలను పునరుద్ధరణ చేస్తామన్నారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం మూసి రివర్ ను ఆనుకొని ఉందని మూసి పునర్జీవం అయిన తర్వాత యూనివర్సిటీ ప్రధాన ద్వారా అన్ని తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న వారసత్వ కట్టడాల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం 15.5 కోట్లు,  అదేవిధంగా నూతన భవన నిర్మాణాలకు తక్షణమే 100 కోట్లు విడుదల చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. హెరిటేజ్ భవనాలు, పునరుద్ధరణ ప్రణాళికలను అధికారులతో కలిసి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క స్వయంగా పరిశీలించారు.