Site icon HashtagU Telugu

Tribal women: పోడు గోడు.. అడవి బిడ్డలపై అటవీ అధికారుల దాడి!

Tribals

Tribals

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ గ్రామంలో అటవీ అధికారులకు, గిరిజనులకు మధ్య జరిగిన వాగ్వాదంలో అటవీ అధికారులు తమను కొట్టారని గిరిజన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన నాలుగు రోజుల క్రితం చోటుచేసుకుంది. అయితే (ఎఫ్‌ఐఆర్) జూన్ 26 (ఆదివారం) నమోదైంది. గ్రామంలో దాదాపు 35 గొట్టికోయ కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలు ఛత్తీస్‌గఢ్‌లోని మద్దుకూరు, బెండలపాడు అటవీ ప్రాంతాల నుంచి మెరుగైన వ్యవసాయ అవకాశాల కోసం తెలంగాణకు వలస వచ్చారు. తాము పత్తి వేయకుండా అటవీ అధికారులు అడ్డుకున్నారని గిరిజన మహిళలు ఆరోపిస్తున్నారు. తాజాగా మరోసారి అటవీ అధికారులు ఐదుగురు గిరిజన మహిళలపై దాడి చేసినట్లు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా తమను వేధిస్తున్నారని ఆరోపించారు. పత్తి, పోడు సాగు చేసేందుకు అటవీశాఖ అధికారులు అనుమతించడం లేదని గిరిజన మహిళలు చెబుతున్నారు.

ఈ విషయమై ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌రావుతో మాట్లాడగా.. తన మనుషులకు, గిరిజనులకు మధ్య వాగ్వాదం జరిగిందని, అయితే అవన్నీ నిజం కాదని పేర్కొన్నాడు. “శుక్ర, శనివారాల్లో గిరిజనులు నిషేధిత ప్రాంతంలో దున్నడం ప్రారంభించారు. పశువుల మేత నుండి భూమిని రక్షించడానికి మేము పశువుల కందకాన్ని నిర్మించాం” ఆయన చెప్పాడు. గిరిజనులు వర్షాకాలంలో పొలాలను దున్నడం కూడా ప్రారంభించారు. “మేము దీనిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు, మగవాళ్ళు తమ మహిళలను దాడికి ప్రేరేపించారు. అయితే మహిళలు కావడంతో పెద్దగా ఏమీ చేయలేకపోయాం. అకస్మాత్తుగా వారు మాపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు, అందులో మా అధికారి ఒకరు గాయపడ్డారు” అని అధికారి చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. 2015లో గ్రామస్తులు, అటవీశాఖ సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణల్లో 10 మంది రైతులు, నలుగురు అధికారులు గాయపడ్డారు.