తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని (Telangana Tourism ) అభివృద్ధి చేయడానికి కొత్త పాలసీ(New Policy Guidelines)ని ప్రకటించింది. దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక జీవోను విడుదల చేసింది. ఈ కొత్త విధానం ద్వారా 15 వేల కోట్ల పెట్టుబడులను సమకూర్చి, 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది. తెలంగాణ టూరిజం పోర్టల్‌ను రూపొందించి, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా రాష్ట్ర పర్యాటక ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేయనుంది. ఇందులో స్పోర్ట్స్ టూరిజం, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం వంటి విభాగాలను ప్రోత్సహించనుంది.
ఈ కొత్త విధానంలో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. వికారాబాద్, సోమశిల, కాళేశ్వరం, నాగార్జున సాగర్, భద్రాచలం, వరంగల్ ప్రాంతాలతో పాటు ఆదివాసీ ప్రాంతాల్లోని జోడేఘాట్, ఉట్నూరు, ఉషేగావ్, కేస్లాగూడ వంటి ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు. చార్మినార్ పరిసరాల్లో లాడ్ బజార్, మక్కామసీదు, చౌమొహల్లా ప్యాలెస్, సాలార్ జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియంలకు మరింత ప్రచారం కల్పించనున్నారు. కాకతీయుల కాలం నాటి కోటలు, దేవాలయాలు, సరస్సులు, రాతి కట్టడాలను పర్యాటక ఆకర్షణగా మార్చనున్నారు. తెలంగాణ పండుగలు బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారక్క జాతరల ప్రత్యేకతను హైలైట్ చేయనుంది.
పర్యాటక ప్రాంతాల్లో భద్రత పెంచేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పోలీసుల గస్తీని పెంచనుంది. మహిళలకు భద్రతను మెరుగుపరచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. అదనంగా, ప్రైవేటు సంస్థల పెట్టుబడులతో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అడ్వెంచర్ టూరిజం, కారవాన్ పార్క్‌లు, హౌస్ బోట్స్ లాంటి కొత్త ఆకర్షణలను ప్రవేశపెట్టనుంది. ఈ విధంగా, తెలంగాణను దేశంలోనే ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున కృషి చేస్తోంది.