Power Policy Soon: తెలంగాణలో సమగ్ర విద్యుత్ విధానం: సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో సమగ్ర విద్యుత్‌ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వివిధ రాష్ట్రాల విద్యుత్ విధానాలను విశ్లేషించి, క్షేత్రస్థాయి నిపుణులతో చర్చించి

Power Policy Soon: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో సమగ్ర విద్యుత్‌ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వివిధ రాష్ట్రాల విద్యుత్ విధానాలను విశ్లేషించి, క్షేత్రస్థాయి నిపుణులతో చర్చించి, ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో ఈ విధానాన్ని రూపొందిస్తామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ,మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి శ్రీధర్ బాబు మరియు విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

విద్యత్ శాఖపై నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో 24 గంటల విద్యుత్ సరఫరా, విద్యుత్ సంస్థల ద్వారా ఇంధన ఉత్పత్తి, కాంగ్రెస్ చేసిన 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా ఎన్నికల హామీతో పాటు కొత్త ఉత్పత్తి వనరులను కనుగొనే చర్యలపై చర్చించారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా, గృహజ్యోతి పథకం అమలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను రేవంత్ కోరారు. రాష్ట్రంలో విద్యుత్ శాఖ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

2014లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత విద్యుత్ సంస్థలు, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి మధ్య జరిగిన లావాదేవీలు, ఒప్పందాలపై సవివరమైన విశ్లేషణ నివేదికలు అందజేయాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. 2014 నుంచి 2023 మధ్య మార్కెట్ ధర కంటే ఎక్కువ మొత్తాలు చెల్లించిన విద్యుత్ సంస్థలతో డీల్‌ల వివరాలను, కారణాలను సమర్పించాలని ఆయన కోరారు. బహిరంగ మార్కెట్‌లో అతి తక్కువ ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. విద్యుత్ వృథాను అరికట్టడంతోపాటు సరఫరా నాణ్యతను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Also Read: Health Problems: పొరపాటున కూడా వీటిని తిన్న తర్వాత కాఫీ, టీ అస్సలు తాగకండి.. తాగారో అంతే సంగతులు?