Site icon HashtagU Telugu

Power Price Hike : మళ్ళీ పెరగనున్న కరెంట్ చార్జీలు

తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. రాష్ట్రంలో డిస్కం నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. ఎన్ని చర్యలు చేపట్టినా నష్టాన్ని పూడ్చలేకపోతున్నాయి. ప్రభుత్వం నుండి సబ్సిడీ ఇస్తోన్నా నష్టాలనుండి బయట పడలేకపోతున్నాయి.వచ్చే రెండేళ్లలో ఈ నష్టం మరింత పెరిగే అవకాశముందని 2023వరకు ఈ లోటు దాదాపు 22కోట్లకు చేరే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.రాష్ట్రంలోని రెండు విద్యుత్తు పంపిణీ సంస్థలు రానున్న రెండేళ్ళకి సంబంధించిన రాబడి వ్యయాల లెక్కలతో వార్షిక ఆదాయ అవసరాల నివేదికలను విద్యుత్తు రెగ్యూలేటరీ అథారిటీకి సమర్పించారు.

డిస్కంలకు మొత్తం రూ.32,856 కోట్ల ఆర్థిక లోటు ఉంటుందని, ఇందులో రెండేళ్లకు కలిపి ప్రభుత్వ రాయితీ దాదాపు 12కోట్లు వస్తాయని, మిగతా లోటు దాదాపు 22 కోట్లు ఉంటుందని తెలిపారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర డిస్కంల లోటు దాదాపు 11 కోట్లు ఉంది. డిస్కంలకు 46 కోట్లు అవసరంకాగా అందులో వినియోగదారుల నుంచి బిల్లుల రూపంలో కేవలం 30 కోట్ల వరకు ఆదాయం వస్తుందని, మిగతా లోటు పూడ్చుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో ఐదున్నర కోట్లు వస్తుందని అంచనా వేసినట్టు డిస్కం సంస్థలు తమ నివేదికలో తెలిపాయి.

ఈ ఆర్థికలోటు పూడ్చాలంటే కరెంటు ఛార్జీలను పెంచాల్సిన అవసరముంది. పెరుగుతున్న డీజిల్‌, ఇతర ఇంధన ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కరెంటు ఛార్జీలను సవరించాలని కేంద్రం కూడా ఆదేశాలిచ్చింది. అయితే కేంద్రం తెస్తోన్న విద్యుత్ సవరణ బిల్లులను రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. లోటును పూడ్చడానికి ప్రభుత్వం సహకరిస్తుందా? లేదా ప్రజలపై భారం మోపుతుందా వేచి చూడాలి.

Exit mobile version