Drunker Thief : దొంగతనానికి వెళ్లి.. వైన్‌షాపు, బ్యూటీ పార్లర్‌లలోనే నిద్రపోయారు

మద్యం దుకాణం పైకప్పు ధ్వంసమై ఉండటంతో.. అక్కడి నుంచే షాపులోకి దొంగ(Drunker Thief) ప్రవేశించి ఉండొచ్చని గుర్తించారు.

Published By: HashtagU Telugu Desk
Drunker Thief Sleep Liquor Shop Medak Telangana

Drunker Thief : వైన్‌ షాపులో దొంగతనం చేసేందుకు అతగాడు రోజంతా కష్టపడి స్కెచ్ గీశాడు. చివరకు వైన్ షా‌పు మూసివేసిన తర్వాత లోపలికి ఎంటర్ అయ్యాడు. వైన్ షాపులో ఉన్న మద్యం సీసాలను చూశాక.. అతడి ఆలోచన మారింది. మస్తుగా తాగిన తర్వాత దొంగతనం సంగతి చూద్దామనుకున్నాడు. తనకు నచ్చినంత వైన్ తాగేశాడు. చివరకు మత్తులోకి జారిపోయి వైన్ షాపులోనే తాపీగా నిద్రలోకి జారుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లా నార్సింగిలోని కనకదుర్గ వైన్స్‌లో చోటుచేసుకుంది. మద్యం తాగడానికి ముందు ఆ దొంగ.. వైన్స్ షాపులోని కౌంటర్లో ఉన్న నగదు, బ్రాండెడ్ మద్యం బాటిళ్లు,  షాప్​లోని సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్​లను సంచిలో మూట కట్టుకున్నాడు. డిసెంబరు 30న ఉదయం వైన్స్ షాపును తెరవగా.. దుకాణం మధ్యలో దొంగ నిద్రిస్తూ కనిపించాడు. దీంతో షాపు నిర్వాహకులు షాక్‌కు గురయ్యారు. వెంటనే రామాయంపేట పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మద్యం మత్తు కారణంగా దొంగ స్పృహలోకి రావడానికి చాలా టైం పట్టింది. అతడు నిద్ర నుంచి మేల్కొన్నాక.. పోలీసులు మందలించి అదుపులోకి తీసుకున్నారు. వైన్స్​ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మద్యం దుకాణం పైకప్పు ధ్వంసమై ఉండటంతో.. అక్కడి నుంచే షాపులోకి దొంగ(Drunker Thief) ప్రవేశించి ఉండొచ్చని గుర్తించారు.

Also Read :GST : ‘జీఎస్‌టీ’.. ‘గుడ్ అండ్ సింపుల్’‌గా లేదండోయ్.. ఎందుకు ?

చెన్నైలోనూ అచ్చం ఇలాంటి చోరీయే.. 

డిసెంబరు 27న తమిళనాడులోని  చెన్నై‌ పరిధి అమింజకరై నెల్సన్‌ మాణిక్కంసాలై ఏరియాకు చెందిన ఒక బ్యూటీపార్లర్‌‌లోనూ ఇదే విధమైన చోరీ యత్నం జరిగింది.  దొంగ ఈ బ్యూటీ పార్లర్‌లోకి ప్రవేశించి.. విలువైన వస్తువులను దొంగిలించాడు. ల్యాప్ టాప్‌ను చోరీ చేశాడు. అన్నింటినీ కలిపి మూట కట్టుకున్నాడు. అనంతరం బ్యూటీ పార్లర్ పై అంతస్తులో ఉన్న గదిలోకి వెళ్లి.. మద్యం తాాగాడు. అనంతరం మత్తులో అక్కడే నిద్రపోయాడు. మరుసటి రోజు (డిసెంబరు 28) ఉదయం బ్యూటీ పార్లర్‌ను నిర్వాహకులు తెరవగా.. లోపల వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పై అంతస్తు నుంచి నిద్ర గురకల సౌండ్స్ వినిపించాయి. పోలీసులు, షాపు నిర్వాహకులు వెళ్లి చూడగా.. దొంగ గాఢమైన నిద్రలో ఉన్నాడు. అతడిని నిద్రలేపి విచారించగా తన పేరు శ్రీధర్‌ అని చెప్పాడు. దొంగిలించిన వస్తువులను దొంగ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

  Last Updated: 31 Dec 2024, 03:55 PM IST