TTDP: తెలంగాణ టీడీపీ దూకుడు

తెలుగుదేశం పార్టీ తెలంగాణ వ్యాప్తంగా మ‌ళ్లీ పుంజుకుంటుందా? ఆ పార్టీ కింగ్ మేక‌ర్ కాబోతుందా? ఖ‌మ్మం నుంచి హ‌వాను ప్రారంభించ‌బోతుందా? అంటే ఆ దిశ‌గా ఆ పార్టీ అడుగులు వేస్తున్న మాట నిజం

  • Written By:
  • Updated On - July 29, 2022 / 01:31 PM IST

తెలుగుదేశం పార్టీ తెలంగాణ వ్యాప్తంగా మ‌ళ్లీ పుంజుకుంటుందా? ఆ పార్టీ కింగ్ మేక‌ర్ కాబోతుందా? ఖ‌మ్మం నుంచి హ‌వాను ప్రారంభించ‌బోతుందా? అంటే ఆ దిశ‌గా ఆ పార్టీ అడుగులు వేస్తున్న మాట నిజం. పైగా వ‌ర‌ద‌ల‌కు భ‌ద్రాచ‌లం మునిగిపోయిన సందర్భంగా చంద్ర‌బాబు హయాంలో నిర్మించిన క‌ర‌క‌ట్ట వ్య‌వ‌హారం బాగా చ‌ర్చ‌ల్లోకి వెళ్లింది. తెలంగాణ వ్యాప్తంగా ఆయ‌న చేసిన ప‌ని గురించి చ‌ర్చించుకున్నారు. అంతేకాదు, సాఫ్ట్ వేర్ ఉద్యోగ‌స్తులు వాళ్ల కుటుంబ స‌భ్యులు ఇప్పుడిప్పుడే బాబు ఆనాడు చేసిన ప‌నుల‌ను అవ‌లోక‌నం చేసుకుంటున్నార‌ని టీడీపీ భావిస్తోంది.

ఉమ్మ‌డి ఏపీ ఉన్న‌ప్పుడు ఏపీ కంటే తెలంగాణ ప్రాంతంలో టీడీపీ బ‌లంగా ఉండేది. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ చేసిన సంచ‌ల‌న నిర్ణ‌యం ప‌టేల్ ప‌ట్వారీ వ్య‌వ‌స్థ‌ ర‌ద్దు ఇప్ప‌టికీ వెనుక‌బ‌డిన వ‌ర్గాలు మ‌రిచిపోలేక‌పోతున్నారు. అందుకే, లీడ‌ర్ల లేక‌పోయిన‌ప్ప‌టికీ ఓట‌ర్లు మాత్రం ఇప్ప‌టికీ ఆ పార్టీకి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని టీడీపీ నాయ‌క‌త్వం మునుప‌టి మాదిరిగా ప‌టిష్టంగా ఉంటే మ‌ళ్లీ పూర్వ వైభ‌వం ఖ‌మ్మం ప్రారంభం అవుతుంద‌ని అంచ‌నా వేస్తోంది. ఖమ్మంతో తెలుగుదేశం పార్టీకి విడదీయరాని బంధం ఉంది. తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా కంచుకోట.

దూరదృష్టితో 2000 సంవత్సరం లో భద్రాచలంలో చేపట్టిన కరకట్టల అభివృద్ధి ఇప్పుడు అందరినీ కాపాడిందని ప్ర‌జ‌ల్లో చ‌ర్చ మొద‌లైయింది. వరదల్లో చనిపోయిన నరసయ్య కుటుంబానికి పార్టీ పరంగా రూ.లక్ష సాయం టీడీపీ అంద‌చేసింది. ఇలాంటి వరదలొచ్చినప్పుడు ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని బాబు కోరారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండలంలోని వరద ముంపు బాధితుల్ని చంద్ర‌బాబు పరామర్శించారు. తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం బలపడుతుందని ఆయ‌న అన‌డం టీడీపీ వ‌ర్గాల్లో ఆశ క‌లుగుతోంది. తెలుగుదేశం ఆవిర్భావం తెలంగాణ లోని హైదరాబాద్ లో జరిగిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. అంటే, రాబోవు రోజుల్లో టీడీపీ కీల‌కం కానుంద‌ని ఆ పార్టీ క్యాడ‌ర్ భావిస్తోంది.