Munugode TDP: మునుగోడు బరిలో టీడీపీ ఔట్!

మునుగోడు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. నిన్నటి మొన్నటి వరకు టీడీపీ కూడా పోటీ చేస్తుందనే వార్తలు వినిపించాయి.

  • Written By:
  • Updated On - October 13, 2022 / 12:06 PM IST

మునుగోడు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. నిన్నటి మొన్నటి వరకు టీడీపీ కూడా పోటీ చేస్తుందనే వార్తలు వినిపించాయి. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికలో పోటీకి తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండనుంది. చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ మేరకు టీటీడీపీ అధ్యక్షుడు బక్కని నరసింహులు గురువారం ఉదయం నిర్ణయం ప్రకటించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని నిర్ణయించామని తెలిపారు. నాయకులు, కార్యకర్తల అభిప్రాయాల మేరకు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు బక్కిన నరసింహులు వెల్లడించారు.

కీలక ప్రకటన

బీసీ వర్గానికి చెందిన ఐలయ్య ప్రస్తుతం తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో బీసీ నేతగా ఆయనకు మంచి పట్టు ఉంది. మునుగోడులో బీసీ వర్గం ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జక్కలి ఐలయ్యను రంగంలోకి దించుతోందని.. ఊహాగానాలు వినిపించాయి. కానీ వాటికి తెరదించుతూ.. టీడీపీ కీలక ప్రకటన చేసింది. మునుగోడు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది.

15న టీటీడీపీ నేతలతో బాబు భేటీ

తెలంగాణ తెలుగుదేశం పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, సమన్వయకర్తలు, నియోజకవర్గాల త్రిసభ్య కమిటీల సభ్యులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ నెల 15న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో సమావేశం కానున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల పురోగతిపైన వారితో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.