Site icon HashtagU Telugu

1.2 Lakh Jobs: లక్ష్యం 120 జీసీసీలు.. 1.2 లక్షల ఉద్యోగాలు: మంత్రి

1.2 Lakh Jobs

1.2 Lakh Jobs

1.2 Lakh Jobs: హైదరాబాద్ నగరం విశ్వసనీయత, సమగ్రత, ఇన్నోవేషన్‌లకు చిరునామాగా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి నిర్వహణ సంస్థల్లో ఒకటైన వాన్‌గార్డ్ తమ ‘గ్లోబల్ వ్యాల్యూ సెంటర్ (GVC)’ ను ప్రారంభించేందుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడం ఈ నగర సామర్థ్యానికి తిరుగులేని నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఏడాదిలోపు 1.2 ల‌క్ష‌ల ఉద్యోగాలు (1.2 Lakh Jobs) సృష్టించాల‌ని మంత్రి తెలిపారు.

6.4 ట్రిలియన్ డాలర్ల ఆస్తుల నిర్వహణ

వాన్‌గార్డ్ ప్రపంచవ్యాప్తంగా అపారమైన 6.4 ట్రిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. అలాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ తెలంగాణ రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఈ చర్య ద్వారా ప్రపంచ ఆర్థిక, సాంకేతిక పటంలో తెలంగాణ బ్రాండ్ మరింతగా విశ్వవ్యాప్తం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రపంచంలోని టాప్-7 కంపెనీలకు హైదరాబాద్ కేంద్రం

ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ – 7 అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని మంత్రి తెలిపారు. ఈ కంపెనీలు సుమారు 30 ట్రిలియన్ డాలర్ల ఆస్తులను పర్యవేక్షిస్తున్నాయని ఆయన వివరించారు.

Also Read: Hinduja Group: ఫలిస్తున్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. రాష్ట్రానికి మ‌రో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు!

ఉద్యోగ కల్పనే లక్ష్యం

రానున్న ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. వచ్చే ఏడాదిలో 120 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (GCC)ను ప్రారంభించి, కొత్తగా 1.2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఉద్యోగ అవకాశాలను తెలంగాణ యువత పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా, ప్రభుత్వం స్కిల్లింగ్, రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్ కార్యక్రమాలలో అత్యుత్తమ నైపుణ్య శిక్షణ అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

వాన్‌గార్డ్ GVC పాత్ర

హైదరాబాద్‌లో ప్రారంభించిన ఈ కొత్త వాన్‌గార్డ్ GVC అనేక అత్యాధునిక సాంకేతిక అంశాలకు కేంద్రంగా పనిచేయనుందని మంత్రి వివరించారు. ఈ కేంద్రం ప్రధానంగా ఇంజనీరింగ్ ఎక్స్‌లెన్స్, క్లౌడ్ మోడర్నైజేషన్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్, సైబర్‌ సెక్యూరిటీకి హబ్‌గా సేవలు అందిస్తుంది. ఇది వాన్‌గార్డ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్‌లో నూతన ఆవిష్కరణలకు మార్గనిర్దేశం చేస్తుందని ఆయన అన్నారు.

రైజింగ్ తెలంగాణలో భాగస్వామ్యం కావాలి

చివరగా, వాన్‌గార్డ్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా రైజింగ్ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను ప్రపంచ ఆర్థిక, సాంకేతిక రంగంలో మరింత ఉన్నత స్థానానికి చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

Exit mobile version