Telangana Student Missing : అమెరికాలో భారత విద్యార్థులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. వాళ్లు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా మే 2వ తేదీ నుంచి అమెరికాలో తెలంగాణ విద్యార్థి చింతకింది రూపేశ్ చంద్ర మిస్సయ్యాడు. విస్కాన్సిన్ రాష్ట్రంలోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ కోర్సు చదువుతున్న రూపేశ్ ఆచూకీ వారం రోజులుగా కనిపించడం లేదు. ఈవిషయాన్ని చికాగోలోని భారత రాయబార కార్యాలయం గురువారం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా అధికారికంగా వెల్లడించింది. ‘మే 2 నుంచి రూపేశ్ చంద్ర కనిపించడం లేదు. అతడి ఆచూకీ కోసం పోలీసులు, ప్రవాస భారతీయులతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని తెలిపింది. షెరిడాన్ రోడ్డులోని 4300 బ్లాక్ నుంచి రూపేశ్(Telangana Student Missing) కనిపించ కుండా పోయాడని చికాగో పోలీసులు చెప్పారు. రూపేశ్ ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు.
We’re now on WhatsApp. Click to Join
తండ్రితో రూపేశ్ మాట్లాడటం అదే చివరిసారి..
- రూపేశ్ చంద్ర తెలంగాణలోని హన్మకొండ జిల్లా వాస్తవ్యుడు.
- వరంగల్ లోని ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం మాస్టర్స్ కోర్సు చేయడానికి అమెరికాకు వెళ్లాడు.
- ‘‘రూపేశ్‌తో మాట్లాడేందుకు ఈ నెల 2న వాట్సాప్ కాల్ చేశాను. అప్పుడు పనిలో ఉన్నానని చెప్పి రూపేశ్ ఫోన్ పెట్టేశాడు’’ అని ఆయన తండ్రి సదానందం చెప్పారు.
- తన కుమారుడి గొంతు వినడం అదే చివరి సారి అని.. అప్పటి నుంచి ఇప్పటిదాకా రూపేశ్ నుంచి ఒక్క కాల్ కూడా తనకు రాలేదని సదానందం తెలిపారు.
- అంతకుముందు అమెరికాలో ఇలాగే తప్పిపోయిన 25 ఏళ్ల హైదరాబాద్ విద్యార్థి అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్ నగరంలో శవమై కనిపించాడు.
- ఈ ఘటనల నేపథ్యంలో రూపేశ్ సురక్షితంగా తిరిగొస్తాడా ? అతడికి ఏమైందో అమెరికా పోలీసులు గుర్తించగలరా ? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి.