Telangana Jobs: తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ల వచ్చేది అప్పుడే.. స్థానికతను ఓటీఆర్ లో అప్ డేట్ చేయకపోతే…!

  • Written By:
  • Publish Date - March 18, 2022 / 10:29 AM IST

తెలంగాణలో కొలువుల జాతర మొదలుకానుంది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మార్చి 9న 80,039 ఉద్యోగాల పై ప్రకటన చేసిన వారం తరువాత దాని ప్రాసెస్ మొదలైంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనికి సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టింది. ఒకటి రెండు నెలల్లో నోటిఫికేషన్లను ఇవ్వడానికి రంగం సిద్దం చేశారు. నిజానికి ఇది కమిషన్ కు పెద్ద సవాలే. ఎందుకంటే దీనికి సమయం కూడా తక్కువగా ఉంటుంది. అందుకే అప్లికేషన్ ప్రాసెస్ సులభమైన పద్దతిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సీఎం కేసీఆర్ ప్రకటన వచ్చి వారం గడిచినా ఎలాంటి నోటిఫికేషన్లు రాకపోవడంతో విద్యార్థుల్లో అసహనం మొదలైంది. కానీ కమిషన్ మాత్రం స్పష్టమైన విధానంతోనే ఉన్నట్టుంది. నోటిఫికేషన్ వచ్చిన తరువాత ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవడానికి దాదాపు 30 నుంచి 45 రోజుల సమయాన్ని ఇచ్చే ఛాన్సుంది. ఆ తరువాత రెండు మూడు నెలల్లో ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన మరింత క్లారిటీ వారంలో వచ్చే అవకాశం ఉంది.

ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడానికి ముందు కొంత ప్రాసెస్ ఉంటుంది. ముందు ఆర్థిక శాఖ.. వివిధ శాఖల నుంచి వివరాలను తీసుకుంటుంది. అంటే రోస్టర్ సిస్టమ్, ఖాళీలు, రిజర్వేషన్ల వివరాలు, అనుభవం, గరిష్ట వయోపరిమితి.. ఇలాంటి వివరాలను సేకరిస్తుంది. దీనివల్ల ప్రతీ ఉద్యోగానికి సంబంధించి తగిన అర్హతలను నిర్ణయించడానికి వీలవుతుంది. కమిషన్ కూడా శాఖల వారీగా ఇండెంట్లను చెక్ చేస్తుంది. ఆయా శాఖలు, కమిషన్ దీనిపై అంగీకారానికి వచ్చిన తరువాత దరఖాస్తుల కోసం నోటిఫికేషన్లను జారీచేస్తారు.

ఆయా శాఖల్లోని ఉద్యోగాలను బట్టి వాటిని ఒక్కోసారి క్లబ్ చేయడం జరుగుతుంది. వివిధ శాఖల్లో ఒకేరకమైన సారూప్యత ఉన్న ఉద్యోగాలకే ఈ వీలుంటుంది. అందుకే ఆయా ఉద్యోగాలను క్లబ్ చేసి నోటిఫికేషన్ ఇస్తారు. లేదంటే ఉద్యోగాల కోసం అప్లయ్ చేసేవారు.. డిపార్ట్ మెంట్ ల వారీగా వేరు వేరు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వివిధ డిపార్ట్ మెంట్ లలో ఉన్న ఒకే రకమైన ఉద్యోగాల కోసం వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం వల్ల ఒకే అభ్యర్థి రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యే ఛాన్సుంది. దీనివల్ల మళ్లీ ఖాళీలు ఏర్పడతాయి. మళ్లీ వాటికి పరీక్షలు నిర్వహించాలి.

కమిషన్ కాని నోటిఫికేషన్లను విడుదల చేస్తే.. కొన్ని లక్షల మంది అప్లయ్ చేసుకునే ఛాన్సుంది. కమిషన్ అంచనా ప్రకరారం.. క్లరికల్ పోస్టుల కోసం దాదాపు 14 లక్షల మంది దరఖాస్తు చేసుకునే ఛాన్సుంది. జిల్లా స్థాయిలో 39,829 ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. జోనల్ స్థాయిలో 18,866, మల్టీ జోనల్ స్థాయిలో 13,170 ఉద్యోగాలను భర్తీ చేయాలి. గ్రూప్-1 కేటగిరీలో 503, గ్రూప్-2 కేటగిరీలో 582, గ్రూప్-3 కింద 1,373, గ్రూప్-4 కింద 9,168 ఖాళీలను భర్తీ చేయాలి.

రాష్ట్రపతి ఉత్తుర్వుల ప్రకారం ఇప్పుడు డిస్ట్రిక్ట్, జోనల్, మల్టీ జోనల్ లెవల్లో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయి. అంతకుముందు ఇది 60-70 శాతంగా ఉండేది. ఇప్పుడు కొత్త ఉత్తర్వుల ప్రకారం అభ్యర్థులు.. 1 నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ చదివితే అదే వారికి స్థానిక ప్రాంతమవుతుంది. అందుకే అభ్యర్థులంతా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) లో తమ వివరాలను అప్ డేట్ చేయాలి. ఈ ఓటీఆర్ లో ఉన్న వివరాలను బట్టి అభ్యర్థులు ఎన్ని ఉద్యోగాలకైనా దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది.

స్థానికతను ఎలా నిర్ణయిస్తారంటే.. హైదరాబాద్ జిల్లా లేదా జోనల్ కేడర్ పోస్టుల విషయానికి వస్తే.. అభ్యర్థులు హైదరాబాద్ లోనే 4 నుంచి 7వ తరగతి వరకు చదివుండాలి. ఒకవేళ వాళ్లు ఒక్కో తరగతిని ఒక్కో జిల్లాలో చదివుంటే.. 7వ తరగతి చదివిన జిల్లానే లోకల్ గా తీసుకుంటారు. ఒకవేళ ఒక అభ్యర్థి.. 1 నుంచి 6వ తరగతివరకు రెండు జిల్లాల్లో చదివి.. తరువాత హైదరాబాద్ లో చదివి ఉంటే.. వాళ్లను హైదరాబాద్ లోకల్ గా గుర్తించరు. స్కూల్ స్థాయిలో ఎక్కువ కాలం ఏ జిల్లాలో చదివితే.. ఆ జిల్లా లోకల్ కిందకు వస్తారు. అందుకే ఈ వివరాల కోసం అభ్యర్థులంతా కచ్చితంగా ఓటీఆర్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్థులు తక్కువగా ఉంటే ఆన్ లైన్ ఎగ్జామ్స్ నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. పరీక్షలు పూర్తయిన తరువాత అవి ఆఫ్ లైన్ లో లేదా ఆన్ లైన్ లో నిర్వహించిన దానిని బట్టి వాటి మూల్యాంకనానికి సమయం పడుతుంది. ఆన్ లైన్ లో నిర్వహించిన కొన్ని ఉద్యోగాల ఫలితాలను విడుదల చేయడానికి ఆరు మాసాలు పట్టొచ్చు. అదే ఆఫ్ లైన్ లో పరీక్షలు నిర్వహించిన మరికొన్ని ఉద్యోగాల ఫలితాలను ప్రకటించడానికి 6 నుంచి 8 నెలలు పట్టొచ్చు. ఒకవేళ ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూలు ఉండే ఉద్యోగాలు అయితే వాటి ఫలితాల ప్రకటనకు ఏడాదైనా పట్టొచ్చు.

అభ్యర్థులు తమ దరఖాస్తును నింపిన తరువాత వాటిని చెక్ చేసుకోవడానికి మూడు నిమిషాల సమయాన్ని ఇస్తుంది కమిషన్. ఆ వ్యవధిలో తమ వివరాలను సరిగా నమోదు చేశారో లేదో చెక్ చేసుకోవచ్చు. సో.. ఉద్యోగాలకు అప్లయ్ చేసేవారు ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయవచ్చు.