Power Tariff: తెలంగాణలో కరెంట్ షాక్.. పెరిగిన విద్యుత్ ఛార్జీలు.. బాదుడే బాదుడు

ఏప్రిల్ ఒకటి నుంచి తెలంగాణలో కరెంటు ఛార్జీలు పెరగబోతున్నాయి. ఇళ్లలో వినియోగించే విద్యుత్ కోసం యూనిట్ కు... విభాగాలను బట్టి 40 నుంచి 50 పైసలను బాదేశారు.

  • Written By:
  • Publish Date - March 24, 2022 / 11:31 AM IST

ఏప్రిల్ ఒకటి నుంచి తెలంగాణలో కరెంటు ఛార్జీలు పెరగబోతున్నాయి. ఇళ్లలో వినియోగించే విద్యుత్ కోసం యూనిట్ కు… విభాగాలను బట్టి 40 నుంచి 50 పైసలను బాదేశారు. అదే పరిశ్రమల విషయానికి వస్తే.. యూనిట్ కు రూపాయ చొప్పున పెంచేశారు. ఈఆర్సీ దీనికి అనుమతిని ఇవ్వడంతో.. ఇక పెరిగిన కరెంట్ ఛార్జీలను వచ్చే నెల నుంచి చెల్లించాల్సిందే. ఈ పెంపు వల్ల రూ.5,596 కోట్ల మేర ఆదాయం సమకూరనుంది.

50 యూనిట్లు లోపు వాడే గృహ వినియోగదారులు ఇప్పటివరకు నెలకు రూ.97.50 కడుతున్నారు. ఇకపై రూ.147.50 చెల్లించాల్సి వస్తుంది. అదే 100 యూనిట్లు వాడేవారైతే.. ఇప్పటివరకు రూ.232.50 చెల్లిస్తుంటే.. ఇకపై రూ.332.50 కట్టాల్సి ఉంటుంది. అదే 200 యూనిట్లు వాడేవారు ఇప్పటివరకు రూ.810 చెల్లిస్తుంటే.. ఇకపై రూ.920 కట్టాలి. అదే 300 యూనిట్లను వినియోగించేవారు.. ఇప్పటివరకు రూ.1780 చెల్లిస్తుంటే.. ఇకపై రూ.1900 చెల్లించాలి.

ఈఆర్సీ చెప్పినదానిని బట్టి చూస్తే.. వ్యవసాయానికి విద్యుత్ ను ఉచితంగానే ఇస్తారు. ఈ పెంపు కుటీర పరిశ్రమలు, సెలూన్లు, విద్యుత్ వాహనాలకు వర్తించదు. ప్రస్తుత ఛార్జీల కన్నా 18 శాతాన్ని అదనంగా పెంచాలని డిస్కమ్ లు కోరాయి. కానీ ఈఆర్సీ మాత్రం 14 శాతం పెంచడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక యూనిట్ కు వేసే ఛార్జీతోపాటు స్థిర డిమాండ్ ఛార్జీ కూడా గృహవినియోగదారులు చెల్లించాల్సిందే. దీంతోపాటు కరెంట్ ను వినియోగిస్తున్నందుకు ప్రభుత్వానికి చెల్లించే ఫ్యూయల్ ఛార్జ్ ను కూడా పెంచేశారు.

పెరిగిన విద్యుత్ బిల్లులతో వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. ఈమధ్యనే ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచారు. ఇప్పటికే కరోనా దెబ్బకు చాలా కుటుంబాలకు ఆదాయం తగ్గిపోయింది. ఇలాంటి స్థితిలో పెరిగిన ఛార్జీల వల్ల తమ బడ్జెట్ మరింతగా తలకిందులవుతుందని ఆందోళనకు గురవుతున్నారు.