తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం నిర్వహించిన సమావేశానికి రేవంత్ హాజరైన తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఒకవైపు సమావేశాన్ని బహిష్కరిస్తామంటూ లీకులు ఇవ్వడం, మరోవైపు అర్ధరాత్రి చీకటి ఒప్పందాలతో ఢిల్లీకి పరుగెత్తుకెళ్లడం ఎంత దుర్మార్గమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన ముఖ్యమంత్రి, చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించడానికే ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు.
Jeep Compass: భారత మార్కెట్లోకి కొత్త కారులు.. కొన్ని రోజులే ఛాన్స్!
బనకచర్ల అంశం అజెండాలో లేదన్న రేవంత్ వ్యాఖ్యలు అబద్దమని, కేంద్ర ప్రభుత్వ అజెండాలో మొట్టమొదటి అంశంగా గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ఉన్నదని గుర్తు చేశారు. ఒకవైపు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు బనకచర్లపై చర్చ జరిగిందంటూ ప్రకటిస్తే, రేవంత్ మాత్రం అసత్యాలు చెబుతుండటం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర విభజన చట్టం, జీఆర్ఎంబీ, అపెక్స్ కమిటీ అనుమతులు లేకుండా బనకచర్ల ప్రీ-ఫీజబులిటీ రిపోర్టు తిరస్కరించబడిన తరుణంలో, కమిటీకి ఒప్పుకోవడం తెలంగాణను మోసం చేసినట్టు అవుతుందని చెప్పారు.
రాష్ట్ర పాలన కాంగ్రెస్ చేతుల్లో లేదు, బీజేపీ రిమోట్ కంట్రోల్‌లో నడుస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనపై చంద్రబాబు, బీజేపీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. కేసీఆర్‌పై విమర్శలు చేయడం తప్ప చంద్రబాబు గురించి ఒక్క మాట కూడా మాట్లాడని రేవంత్, తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని, పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిని రాష్ట్ర సలహాదారుగా నియమించడం దారుణమని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రీ ఏర్పాట్లపై కూడా కాంగ్రెస్ అబద్ధ ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.
నీటి వివాదాలపై రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, మేడిగడ్డ, జూరాల, సుంకిశాల వంటి ప్రాజెక్టుల బద్వలతలను గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో 17 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు అందించామని, కాంగ్రెస్ పాలనలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని, ఈ ద్రోహానికి రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. “నీళ్ల విషయంలో నిజాయితీ ఉండాలి. లేకపోతే ప్రజలు నీళ్లలో ముంచుతారు” అని హెచ్చరించారు.