Site icon HashtagU Telugu

Telangana Budget 2022: నేడే తెలంగాణ బడ్జెట్.. రెడీగా ఉన్న ప్ర‌తిప‌క్షాలు..!

Telangana Budget2022

Telangana Budget2022

తెలంగాణలో ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈరోజు బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు, శాసనమండలిలో ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగం దాదాపు గంటన్నర పాటు సాగే అవకాశముంది. టీఆర్ఎస్ అధినేత రాష్ట్ర‌ ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిని ఎన్నికల బడ్జెట్ గానే భావిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఈ బ‌డ్జెట్‌లో సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసినట్లు స‌మాచారం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 2.30 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం, ఈసారి 2.65 లక్షల కోట్ల నుంచి 2.70 లక్షల కోట్ల మేర బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బ‌డ్జెట్‌లో ప్రధానంగా దళితబంధుతో పాటు మరికొన్ని పథకాలకు కూడా నిధులు కేటాయించారని సమాచారం. అభివృద్ధి, సంక్షేమం సమతూకంగా ఈ బడ్జెట్‌ను రూపొందించారని చెబుతున్నారు.

ఇక కరోనా పరిస్థితుల నుంచి బయటపడి రాష్ట్ర వృద్ధిరేటు బాగా పెరగడంతో గత ఏడాది కంటే 35 వేల కోట్ల మేర బడ్జెట్‌ పరిమాణాన్ని పెంచనుంది.భారీగా ఉద్యోగాల భర్తీకి అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం స్పష్టం చేయనుంది. వచ్చే ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నందున ఇదే పూర్తిస్థాయి బడ్జెట్‌ కావడంతో ఎన్నికల బడ్జెట్‌గానే భావించి కసరత్తు చేసినట్లు సమాచారం. సంక్షేమం, వ్యవసాయానికి ఈ బ‌డ్జెట్‌లో పెద్దపీట వేశారని తెలుస్తోంది.

ఈ నేప‌ధ్యంలో దళితబంధుకు 20 వేల కోట్లు, రైతుబంధుకు 15 వేల కోట్ల మేర కేటాయించనున్నట్లు స‌మాచారం. అయితే ఇక్క‌డ ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే.. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తుండటంతో కాంగ్రెస్ అండ్ బీజేపీ నేత‌లు ఆందోళనకు దిగే అవకాశముందని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా పెద్దయెత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఎన్నిరోజులు బడ్జెట్ సెషన్స్ నిర్వహించాలన్నది నిర్ణయిస్తారు.