Drunk and Drive : మందు బాబులం.. మేం మందుబాబులం.. ఆ ప్ర‌మాదాల్లో ‘తెలంగాణ‘ సెకండ్ ప్లేస్!

హైద‌రాబాద్‌లో ప్ర‌తిరోజు ఏదో ఒక ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న‌ప్ప‌టికీ వాహ‌న‌దారుల తీరు మార‌డం లేదు. వీకెండ్స్‌లో వంద‌ల సంఖ్య‌లో వాహ‌న‌దారులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డుతున్నారు.

  • Written By:
  • Publish Date - October 29, 2021 / 12:58 PM IST

హైద‌రాబాద్‌లో ప్ర‌తిరోజు ఏదో ఒక ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న‌ప్ప‌టికీ వాహ‌న‌దారుల తీరు మార‌డం లేదు. వీకెండ్స్‌లో వంద‌ల సంఖ్య‌లో వాహ‌న‌దారులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డుతున్నారు. వీరిని తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి ఫైన్ వేసి వ‌దిలేస్తున్నారు. త‌రువాత య‌ధామాములుగానే వీరంతా తాగి రోడ్ల‌పై డ్రైవ్ చేస్తున్నారు.దీనికి నిద‌ర్శ‌న‌మే ఎన్‌సీఆర్‌బీ విడుద‌ల చేసిన నివేదిక‌.

మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గురువారం ఓ నివేదిక‌ను విడుదల చేసింది. భారతదేశంలో ప్రమాద మరణాలు, ఆత్మహత్యలు 2020 నివేదిక ప్రకారం, 2020 సంవత్సరంలో నమోదైన 3,026 మరణాల్లో తెలంగాణలో 340 మంది తాగి డ్రైవింగ్ చేస్తూ మరణించార‌ని ఎన్‌సీఆర్‌బీ వెల్ల‌డించింది. ప్రమాద మరణాల రేటు 31.5 శాతంగా ఉంది. ఇది జాతీయ సగటు 27.7 శాతం కంటే కొంచెం ఎక్కువ. తెలంగాణలో మొత్తం ప్రమాద మరణాల సంఖ్య 11,822 కాగా, అందులో 9,868 మంది పురుషులు, 1,954 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో 19,505 ట్రాఫిక్ ప్రమాదాలు నమోదైయ్యాయి. దీనిలో 7,219 మంది మరణించ‌గా 18,661 మంది గాయపడ్డారు. 2020 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల్లో 6,882 మంది మరణించగా, రైల్వే ప్రమాదాల్లో 337 మంది మరణించారు.

రాష్ట్రంలో 262 మంది గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్లు నివేదిక‌లో పేర్కొంది. 24 మంది జంతువులు, 12 మంది ఆహార విషం కారణంగా మరణించారు. పాము కాటు కారణంగా మొత్తం 168 మంది చనిపోగా.. వాణిజ్య భవనాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఆరుగురు మరణించిన‌ట్లు తెలిపింది. నివాస భవనాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 79 మంది మరణించగా…ప్రభుత్వ భవనాల్లో అగ్నిప్రమాదం కారణంగా 9 మంది మరణించారు.