Site icon HashtagU Telugu

Bhatti Vikramarka Mallu: హిమాచల్ ప్రదేశ్ తో తెలంగాణ 520 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఒప్పందం

Bhatti Vikramarka Mallu

Bhatti Vikramarka Mallu

తెలంగాణ రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని, విద్యుత్ వనరుల విస్తరణకు, తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ప్రకారం పర్యావరణ పరిరక్షణకు హిమాచల్ ప్రదేశ్ తో 520 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఒప్పందం చేసుకోవడం గొప్ప ముందడుగు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కు ఆ రాష్ట్ర అధికారులతో కలిసి డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు భద్రతను పెంచుకునే అంశానికి కట్టుబడి ఉందని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర భాగస్వామ్యంతో ప్రతిపాదిత ప్రాజెక్టులు సెలి (400 మెగావాట్లు), మేయర్ (120 మెగావాట్లు)స్వచ్ఛమైన, ఆర్థికంగా మేలైన, విశ్వసనీయమైన విద్యుత్తు ను పొందడంలో ఉపకరిస్తాయని డిప్యూటీ సీఎం అభివర్ణించారు. జల విద్యుత్తు అత్యంత విశ్వసనీయమైన గ్రీన్ పవర్. థర్మల్ పవర్ తో పోల్చినప్పుడు హైడల్ పవర్ ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుంది, అంతేకాకుండా థర్మల్ పవర్ ఉత్పత్తి ఖర్చు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండగా హైడల్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు క్రమంగా తగ్గుతూ వస్తుందని వివరించారు.

హిమాచల్ ప్రదేశ్ హిమాలయ పరివాహక నదులతో నిండి ఉన్న రాష్ట్రం కావడంతో సంవత్సరంలో 9 నుంచి 10 నెలల పాటు నిరంతరం హైడల్ పవర్ ఉత్పత్తికి అనువుగా ఉంటుంది అన్నారు. హిమాచల్ తో పోలిస్తే దక్షిణ భారతదేశ నదులపై హై డల్ విద్యుత్ ఉత్పత్తి కాలం పరిమితంగా ఉంటుందని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ సహజ వనరులను వినియోగించుకుని తెలంగాణ ప్రజలకు తక్కువ ధరకు, నమ్మకమైన మరియు పర్యావరణ హిత విద్యుత్ ను అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని ఈ ఒప్పందం ముందుకు తీసుకెళుతుంది అన్నారు.

ఈ ప్రాజెక్టులను తెలంగాణ జెన్కో నామినేషన్ విధానంలో చేపడుతుంది, తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ పవర్ వాటాను పెంచేందుకు నిరంతరం కృషి చేస్తోంది అని వివరించారు. భారతదేశ విద్యుత్ రంగంలో, అంతర్రాష్ట్ర సహకారానికి హిమాచల్ ఒప్పందం గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పాటును అందించడమే కాకుండా హిమాచల్ ప్రదేశ్ హైడ్రో ఎలక్ట్రిక్ వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు సహాయపడుతుందని తెలిపారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, SPDCL CMD ముషారఫ్ ఫరూకి, జెన్కో హైడల్ డైరెక్టర్ సచ్చిదానంద, హిమాచల్ ప్రదేశ్ ఎనర్జీ డైరెక్టర్ రాకేష్ ప్రజాపతి, హిమాచల్ ప్రదేశ్ స్పెషల్ సెక్రటరీ ఎనర్జీ అరిందం చౌదరి తదితరులు పాల్గొన్నారు.