తెలంగాణ సచివాలయం(Telangana Secretariat )లో గత మూడు రోజులుగా ఉద్యోగులకు వరుసగా బెదిరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపింది. సచివాలయాన్ని పేల్చేస్తానంటూ (Bomb Threat) ఓ వ్యక్తి పదేపదే కాల్ చేయడంతో, అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆ కాల్ చేసిన నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సచివాలయ భద్రతకు సంబంధించి ఇటీవలి కాలంలో ఇది రెండో ఘటన కావడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. హైదరాబాద్ లంగర్‌హౌజ్‌కు చెందిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీ అనే వ్యక్తి.. ముఖ్యమంత్రి కార్యాలయం ఫిర్యాదుల విభాగానికి ఫోన్ చేసి సచివాలయాన్ని పేల్చేస్తానని హెచ్చరించాడు. మొదట అధికారులు దీన్ని నిర్లక్ష్యంగా తీసుకున్నప్పటికీ, అతడు మూడు రోజుల పాటు వరుసగా కాల్స్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఫోన్ నంబర్ ట్రేస్ చేసి అతడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Karunaratne: 100 టెస్టు మ్యాచ్‌లు ఆడి రిటైర్.. ఆశ్చర్యపరుస్తున్న లంక ఆటగాడి నిర్ణయం!
పోలీసుల విచారణలో సయ్యద్ మీర్ మహ్మద్ అలీ ఓ దర్గాకు సంబంధించిన సమస్యపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నాడని, తన విన్నపానికి స్పందన లేకపోవడంతో కోపంతో బెదిరింపు కాల్స్ చేసినట్లు వెల్లడించాడు. అదుపులోకి తీసుకున్న తరువాత కూడా అతడు పోలీసులతో పాటు సచివాలయ అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఇదే సమయంలో కొన్ని రోజుల క్రితం మరో నకిలీ ఉద్యోగి సచివాలయంలో కలకలం సృష్టించాడు. ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్ రావు అనే వ్యక్తి, నకిలీ ఐడీ కార్డు సృష్టించి, రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నట్లు నటించాడు. అధికారులు అనుమానం వచ్చి విచారణ చేయగా, అతడు నకిలీ ఉద్యోగి అని తేలింది. మరింత విచారణ జరిపితే, అతనికి నకిలీ ఐడీ కార్డు మైనారిటీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రశాంత్ డ్రైవర్ రవి అందించినట్లు తెలుస్తోంది. ఇలా ఈ రెండు ఘటనలు తెలంగాణ సచివాలయ భద్రతపై తీవ్ర ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.