తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ప్రజల సౌకర్యం మేరకు సాంకేతికతను వినియోగిస్తూ, వివిధ ధ్రువీకరణ పత్రాలు మరియు సర్వీసుల కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. జన్మ ధ్రువీకరణ పత్రం, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు 20 రకాల సేవలను ఈ యాప్ ద్వారా పొందే అవకాశం కల్పించనున్నారు. గ్రామీణ ప్రజలకు పంచాయతీ సేవలను సులభతరం చేయడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న ‘మై-పంచాయతీ’ (My Panchayat app) యాప్ ద్వారా పంచాయతీ పరిధిలోని పలు రకాల సేవలను ఆన్లైన్లో పొందొచ్చు.
ఇందులో బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్, హౌజ్ పర్మిషన్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ముఖ్యమైన సేవలు అందించబోతున్నారు. ఈ యాప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలు మరింత చేరువవుతాయి. గ్రామాల్లో తలెత్తే సమస్యలను నివేదించడానికి ఈ యాప్ ఉపయోగకరంగా ఉండబోతుంది. ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు రూపంలో పంపించవచ్చు. తద్వారా సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయి. ప్రజల అభ్యర్థనలు నేరుగా సంబంధిత అధికారులకు చేరేలా ఈ యాప్ పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రజలు ఎక్కడి నుంచైనా సేవలను పొందగలరు. దరఖాస్తు చేసుకున్న పత్రాలను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. పంచాయతీ కార్యాలయానికి వెళ్లి పత్రాల కోసం వేచి ఉండే అవసరం లేకుండా ప్రజలు సమయాన్ని మరియు శ్రమను ఆదా చేసుకోగలుగుతారు.
ఈ యాప్‌ను తెలంగాణ ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ప్రయత్నం గ్రామీణ ప్రజల జీవితాల్లో మార్పుని తీసుకురావడమే కాకుండా, ప్రభుత్వం-ప్రజల మధ్య అవగాహనను పెంపొందించడానికి దోహదపడుతుంది. పంచాయతీ సేవలను డిజిటలైజ్ చేయడం తెలంగాణ సర్కార్ ముందుచూపుని తెలియజేస్తోంది.
Read Also : Telangana Debt : తెలంగాణ అప్పుపై తప్పుడు ప్రచారం చేస్తారా.. ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెడతాం : కేటీఆర్