2BHK Houses: డబుల్ ట్రబుల్.. పేదోడికి గూడేదీ?

అర్హులైన పేద ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ‘డబుల్ బెడ్రూం’ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి పేదల నుంచి భారీ రెస్పాన్స్ రావడంతో ప్రభుత్వానికి తలనొప్పులు మొదలయ్యాయి. మలి విడుత కింద తెలంగాణ వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇళ్లు సిద్ధమయ్యాయి.

Published By: HashtagU Telugu Desk
Double

Double

అర్హులైన పేద ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ‘డబుల్ బెడ్రూం’ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి పేదల నుంచి భారీ రెస్పాన్స్ రావడంతో ప్రభుత్వానికి తలనొప్పులు మొదలయ్యాయి. మలి విడుత కింద తెలంగాణ వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇళ్లు సిద్ధమయ్యాయి. అయితే అధికారులు, రాజకీయ నాయకులు అర్హులను గుర్తించడం లేదనే కారణం.. ఇళ్లను కట్టించి నెలలు గడుస్తున్నా.. అభ్యర్థులకు అందించకపోవడంతో కొత్త చిక్కులకు కారణమవుతున్నాయి.

పెద్దపల్లి  జిల్లాలోని మంథనిలో అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్ల స్థలాల ప్రారంభానికే ముందే లబ్ధిదారులు ఆక్రమించుకోవడం, దరఖాస్తుదారులుగా చెప్పుకుంటున్న మరికొంతమంది పేదలు ఇళ్లకు తాళాలు వేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరుగడంతో తహశీల్దార్ బండ ప్రకాష్, పోలీసు అధికారులతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాంట్రాక్టర్ ఇంతవరకు నిర్మాణాలు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించకపోవడంతో ఎవరికీ ఇళ్లు కేటాయించలేదని వాపోయారు. ఇండ్ల కేటాయింపులో పైచేయి సాధించేందుకు స్థానిక రాజకీయ వర్గాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

పెద్దపల్లి జిల్లా మంథనిలో ఇంకా పూర్తికాని ఇళ్లకు బుధవారం స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుడు తాళం వేసినట్లు సమాచారం. అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలకు 2 బీహెచ్‌కే ఇళ్లకు అనర్హులు అయినప్పటికీ, ఇళ్ల తాళాలను అందజేశారు. ఇళ్లు మంజూరయ్యాయని తెలుసుకున్న స్థానికులు ఇళ్ల స్థలాలు తమవే అంటూ సామాన్లతో అక్కడికి చేరుకున్నారు. ముందుగా వ్యక్తులు వేసిన తాళాలు పగులగొట్టేందుకు ప్రయత్నించారు. కాగా ప్రతిపక్ష పార్టీల నేతలే సమస్య సృష్టిస్తున్నారని  అధికార నాయకులు ఆరోపించారు. తహశీల్దార్‌ ఘటనా స్థలానికి చేరుకుని ‘‘ఇప్పటి వరకు ఎవరికీ ఇళ్లు మంజూరు కాలేదన్నారు. ఇళ్లు అసంపూర్తిగా ఉండడంతో పాటు కరెంటు, నీటి వసతి లేదు. ఇళ్లు నిర్మించే కాంట్రాక్టర్ ఇప్పటి వరకు ఇళ్లను ప్రభుత్వానికి అప్పగించలేదని స్పష్టం చేశారు. ఈ రెండు గ్రూపుల వెనుక జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్, ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరిద్దరూ రాజకీయంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అయితే ఇరువర్గాల ఘర్షణలో ఇండ్లకు అర్హులైన పేదవాళ్లు నష్టపోతున్నారు. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే కాకుండా హైదరాబాద్ శివారు ప్రాంతాలు, మేడ్చల్, సిద్దిపేట, మెదక్ జిల్లాలోనూ అర్హులైన పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు.

  Last Updated: 04 Mar 2022, 01:20 PM IST