TSTRC : అలా చేస్తే 10వేలు జీతం క‌ట్‌.. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల్లో కొత్త టెన్ష‌న్‌

తెలంగాణ ఆర్టీసీలో కొత్త పద్దతులతో డ్రైవర్లు బెంబేలెత్తిపోతున్నారు. నెక్ట్స్ టార్గెట్ తామేనా అని అటు కండక్టర్లూ అల్లాడిపోతున్నారు. ఎందుకంటే.. మిధానీ డిపోలో పనిచేసే ఓ డ్రైవర్ కు డిపో మేనేజర్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు.

  • Written By:
  • Publish Date - May 8, 2022 / 09:28 PM IST

తెలంగాణ ఆర్టీసీలో కొత్త పద్దతులతో డ్రైవర్లు బెంబేలెత్తిపోతున్నారు. నెక్ట్స్ టార్గెట్ తామేనా అని అటు కండక్టర్లూ అల్లాడిపోతున్నారు. ఎందుకంటే.. మిధానీ డిపోలో పనిచేసే ఓ డ్రైవర్ కు డిపో మేనేజర్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. దాని సారాంశం ఏమిటంటే.. సదరు డ్రైవర్.. సూపర్ లగ్జరీ బస్సును నడపడానికి ఆర్టీసి నిర్దేశించిన ఇంధనం కంటే ఎక్కువగా.. అంటే 102 లీటర్ల డీజిల్ ను అదనంగా వాడారు. దీనికి సరైన కారణం చెప్పకపోతే ఆ డీజిల్ ఖరీదుకు సమానమైన రూ.10,710 మొత్తాన్ని జీతంలో కోయక తప్పదని చెప్పారు. దీంతో ఆ డ్రైవర్ నోట మాట రాలేదు.

సూపర్ లగ్జరీ బస్సు లీటర్ కు 5.20 కి.మి. మేర మైలేజ్ ఇవ్వాలన్నట్టుగా తెలంగాణ ఆర్టీసీ టార్గెట్ పెట్టుకుంది. కానీ ఈ డ్రైవర్ మాత్రం గత నెలలో లీటర్ కు 4.64 కి.మి. మేర మైలేజ్ వచ్చేలా బస్సును నడిపారు. ఇప్పుడున్న బస్సులన్నీ పాతవని.. దానికి ఈమాత్రం మైలేజ్ రావడమే ఎక్కువని.. అలాంటిది కొత్త రూల్ ఏంటంటూ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ఏడేళ్లుగా కొత్త బస్సులు కొనుగోలు చేయకుండా..
ఇప్పుడు నెపాన్ని తమపైకి నెట్టేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

రూల్స్ ప్రకారం చూస్తే.. 15 లక్షల కి.మి. దాటిన బస్సులను నడపకూడదు. కానీ తెలంగాణ ఆర్టీసీ మాత్రం.. ఏదోలా వాటిని మ్యానేజ్ చేసి ఫిట్ నెస్ సర్టిఫికెట్ ను తెచ్చుకుంటోంది. అలాంటప్పుడు ఆ బస్సులు ఎక్కువ మైలేజ్ ని ఎలా ఇస్తాయని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ రోడ్లపై నిత్యం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట సూపర్ లగ్జరీ బస్సు మైలేజీ 4.5 – 5 కి.మి.లను మించదు. అదే హైవేలో అయితే 5 – 5.5 కి.మి. మేర మైలేజ్ ను తీసుకురావచ్చంటున్నారు నిపుణులు. ఇప్పుడు డ్రైవర్ల వరకు వచ్చిందని.. ఇకపై కలెక్షన్ తగ్గిందన్న పేరుతో తమ జీతాల్లోనూ కోత విధిస్తారేమో అని కండక్టర్లూ టెన్షన్ పడుతున్నారు.