తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులను (Investments) ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ అంతర్జాతీయ సదస్సు డిసెంబర్ 8 మరియు 9 తేదీల్లో జరగనుంది. ఈ సమ్మిట్‌కు దేశ విదేశాల నుండి వివిధ రంగాలకు చెందిన నిపుణులు, ప్రముఖులు, మేధావులు సహా 4,000 మందికి పైగా అతిథులుగా హాజరుకానున్నారు. ఈ భారీ సదస్సు ద్వారా, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఉన్న ప్రత్యేకతను ప్రపంచ వేదికపై ప్రదర్శించాలని రేవంత్ సర్కార్ సంకల్పించింది. అంతేకాకుండా, తెలంగాణను ‘సభూతో న భవిష్యత్’ అన్నట్లుగా పెట్టుబడులకు స్వర్ణధామంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమ్మిట్‌ను విజయవంతం చేయడం ద్వారా, తెలంగాణ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది వేయాలని ప్రభుత్వం కృషి చేస్తోంది.
Amaravati : అమరావతికి రాజధాని హోదా.. కేంద్రం సవరణ బిల్లు
సదస్సుకు హాజరయ్యే అతిథులను తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా స్వాగతించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అతిథులకు అందిచే స్పెషల్ గిఫ్ట్ బాస్కెట్‌లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే అనేక జ్ఞాపికలు ఉండనున్నాయి. ఇందులో ముఖ్యంగా పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోతో కూడిన సావనీర్ కిట్లు, పోచంపల్లి తాలువా, మరియు నిర్మల్ మాస్క్ పెయింటింగ్స్ ఉండనున్నాయి. అంతేకాక, హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపునిచ్చే హైదరాబాద్ అత్తర్ మరియు హైదరాబాద్ ముత్యాలతో చేసిన ఆభరణాలు కూడా ఈ బాస్కెట్‌లో భాగమవుతాయి. మరోవైపు, రుచికరమైన వంటకాలతో కూడిన ఫుడ్ బాస్కెట్‌ను కూడా అందించనున్నారు. ఇందులో మహువా లడ్డులు, సకినాలు, బప్పాలు, రామ్ డి వంటి సాంప్రదాయ తెలంగాణ వంటకాలు ప్రత్యేక డిజైన్ చేసిన కవర్లలో ప్యాక్ చేసి స్వాగతం పలకనున్నాయి.
ఈ సదస్సు కోసం దేశంలోని ప్రముఖులను ఆహ్వానించే బాధ్యతను రేవంత్ ప్రభుత్వం స్వయంగా తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంతర్జాతీయ ప్రముఖులతో పాటు, దేశ ప్రధాని నరేంద్ర మోదీని స్వయంగా కలిసి ఆహ్వానించనున్నారు. అలాగే కాంగ్రెస్ అగ్ర నేతలు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే మరియు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా సదస్సుకు హాజరుకానున్నారు. ఇంతేకాక దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను (సీఎంలను) కూడా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా, ఆయా రాష్ట్రాల సీఎంలను కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానించే బాధ్యతను డిసెంబర్ 4న మంత్రులకు అప్పగించారు. ఈ విధంగా కేంద్ర నాయకులను, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించడం ద్వారా, సదస్సుకు జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడంతో పాటు, పెట్టుబడుల ఆకర్షణకు మరింత అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలని రేవంత్ ప్రభుత్వం వ్యూహరచన చేసింది.
