తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8 మరియు 9వ తేదీల్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ను అత్యంత వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసింది. ‘తెలంగాణ రైజింగ్ థీమ్’ తో నిర్వహించనున్న ఈ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు దేశ విదేశాలకు చెందిన దిగ్గజాలు, పరిశ్రమల అధినేతలు, ఇన్నోవేటర్లు, పాలసీ మేకర్లు, సినీ, క్రీడా, విద్యా రంగాలకు చెందిన ప్రముఖులు, విదేశీ రాయబారులు ఒకే వేదికపైకి రానున్నారు. ఈ సదస్సుకు సుమారు 4,800 మందికి పైగా ఆహ్వానాలు పంపగా, ఇప్పటికే 600 మందికిపైగా జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు తమ సంసిద్ధతను తెలియజేశారు. మొత్తంమీద సుమారు 1000 మందికిపైగా ప్రముఖ అతిథులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
Tirumala Darshan Tickets : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లెటర్లతో బ్రేక్ దర్శనం స్కాం..!
రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రతిష్టాత్మక సదస్సులో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనపై కీలక చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వృద్ధిని $3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికలపై పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిష్ణాతులతో చర్చాగోష్ఠులు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో ప్రధానంగా దృష్టి సారించే అంశాలలో కాలుష్య రహితం (నెట్ జీరో), సెమీ కండక్టర్ల పరిశ్రమ అభివృద్ధి, కృత్రిమ మేధ (Artificial Intelligence), నైపుణ్యంతో కూడిన మానవ వనరుల అభివృద్ధి, మహిళా సాధికారత, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వృద్ధి, క్రీడాభివృద్ధి వంటి అంశాలు ఉన్నాయి. ఈ చర్చల ద్వారా రాష్ట్రంలో సుమారు రూ. లక్ష కోట్లకుపైగా పెట్టుబడులకు సంబంధించిన కీలక ఒప్పందాలు (MoUs) జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అతిథులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సదస్సు తెలంగాణకు పారిశ్రామిక, ఆర్థిక కేంద్రంగా ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించడానికి దోహదపడుతుంది. ప్రముఖుల మేధోమథనం ద్వారా లభించే సూచనలు, ప్రణాళికలు రాబోయే దశాబ్దాలలో రాష్ట్ర ప్రగతికి, అభివృద్ధి లక్ష్యాల సాధనకు దిశా నిర్దేశం చేయనున్నాయి.
