Site icon HashtagU Telugu

ఏపీ కంటే ఎక్క‌వ‌గా తెలంగాణ వ‌రి కొనుగోళ్లు

వ‌రి ధాన్యం కొనుగోలు రూపంలో బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య రాజ‌కీయ వార్ తార‌స్థాయికి చేరింది. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, సీఎం కేసీఆర్ మ‌ధ్య మాటల యుద్ధానికి లోక్ స‌భ ఫుల్ స్టాప్ పెట్టే ప్ర‌య‌త్నం చేసింది. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లోని కొనుగోళ్ల వివ‌రాల‌ను కేంద్ర స‌హాయ మంత్రి సాద్వి నిరంజ‌న్ జ్యోతి బ‌య‌ట‌పెట్టాడు. అన్నపూర్ణంగా పేరున్న ఏపీ కంటే తెలంగాణ రాష్ట్రంలోనే వ‌రి ధాన్యం ఎక్కువ‌గా కొనుగోలు చేసిన విష‌యాన్ని వెల్ల‌డించాడు.
2020-21 ఖరీఫ్ సీజన్ లో 521.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వ లక్ష్యంకాగా, తెలంగాణ నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన‌ట్టు చెప్పాడు. యాసంగికి సంబంధించి సీజన్ మొదలయ్యాకే ఎంత సేకరించాలన్న టార్గెట్ నిర్ణయిస్తామని చెప్ప‌డం వివాదానికి ఆజ్యం పోసింది.
2020-21లో ఏపీ నుంచి 56.67 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేంద్రం సేకరించింది. తెలంగాణ నుంచి 94.53 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేసింది. 2019-20లో ఏపీ నుంచి 55.33 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయ‌గా, తెలంగాణ నుంచి 74.54 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేంద్రం సేక‌రించింది. 2018-19లో ఏపీ నుంచి 48.06 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించ‌గా, తెలంగాణ నుంచి 51.90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేంద్రం కొనుగోలు చేసింది. ఆ విష‌యాన్ని కేంద్ర మంత్రి జ్యోతి వెల్ల‌డించారు.
ఉప్పుడు బియ్యం విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వానికి,కేంద్ర స‌ర్కార్ కు మ‌ధ్య పొంత‌న కుద‌ర‌డంలేదు. ఎవ‌రి చెప్పే లాజిక్ వాళ్లు చెబుతున్నారు. ఆ క్ర‌మంలో పండించిన ధాన్యం అమ్ముకోలేక రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరుగుతున్నాయి. బీజేపీ ఈ సీజ‌న్ లో వ‌రి ఎంత పండించిన‌ప్ప‌టికీ కొనుగోలు చేస్తామ‌ని చెబుతోంది. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి హామీ ఇస్తున్నాడు. అదే స‌మ‌యంలో ఒక్క గింజ కూడా వ‌చ్చే సీజ‌న్ లో కొనలేమని టీఆర్ఎస్ స‌ర్కార్ తెగేసి చెబుతోంది. ఇలా భిన్నంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చెప్ప‌డం రైతులను అయోమ‌యానికి గురి చేస్తోంది.