Telangana Rains: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంకు బయలుదేరారు. రోడ్డు మార్గాన సీఎం ఖమ్మంకు బయలుదేరారు. సీఎం రోడ్డు మార్గాన వెళ్తుండటంతో అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి వరదలు, సహాయక చర్యలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టం, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వి.నరేంద్రరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్, డీజీపీ జితేందర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
వరదల ప్రభావిత ప్రాంతాలకు సకాలంలో సహాయం అందించడానికి వ్యూహాలపై సీఎం చర్చించారు. భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి జిల్లా కలెక్టరేట్‌లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. వరదల వల్ల చనిపోయిన బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని పేర్కొన్నారు. వర్షాల కారణంగా చనిపోయిన కుటుంబాలకు ఆర్థికసాయం 5 లక్షలకు పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో మృతుల కుటుంబాలకు 4 లక్షల పరిహారం ప్రకటించగా.. దాన్ని రూ. 5 లక్షలకు పెంచుతూ రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో ఖమ్మం బయల్దేరారు. వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసి అందుకు తగ్గ చర్యలు తీసుకుంటారు సీఎం. ముఖ్యమంత్రి పర్యటన వరద సంక్షోభాన్ని పరిష్కరించడంలో సహాయపడుతుంది.
Also Read: Telangana Rains: రోడ్డు మార్గాన ఖమ్మంకు సీఎం, మృతుల కుటుంబాలకు 5 లక్షలు