Site icon HashtagU Telugu

TSPSC Paper Leak: దుమారం రేపుతున్న పేపర్ లీక్.. టీఎస్‌పీఎస్సీ ఆఫీస్ వద్ద రణరంగం

Tspsc Notifications

Tspsc Notifications

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)కి చెందిన ఇద్దరు ఉద్యోగులతో సహా తొమ్మిది మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. టిఎస్‌పిఎస్‌సి అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) రిక్రూట్‌మెంట్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని లీక్ చేయడంలో వీరి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. వారి వద్ద నుంచి నాలుగు హార్డ్ డ్రైవ్‌లు, మూడు ల్యాప్‌టాప్‌లు, ఎనిమిది మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

AE సివిల్, జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రాలు లీక్ అయినట్టు పోలీస్ విచారణలో వెల్లడైన నేపథ్యంలో TSPSC నేటి మధ్యాహ్నం 3 గంటలకు అత్యవసర సమావేశం జరపాలని నిర్ణయించింది. ఈ రెండు పరీక్షలను రద్దు చెయ్యాలా? లేక ఎవరికైతే ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయో వారి ఫలితాలను నిలుపుదల చెయ్యాలా? అనేది ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.

పేపర్ లీకేజీ ఘటన నేపథ్యంలో TSPSC కార్యాలయం ఎదుట BJYM నేతలు ఆందోళనకు దిగారు. గేట్లు దూకి లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఓ దశలో TSPSC కార్యాలయం బోర్డును ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు బీజేవైఎం నేతల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. మరోవైపు.. TSPSC కార్యాలయాన్ని తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం ముట్టడించింది. ఉద్యోగాలను అమ్ముకుంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని నేతలు ధ్వజమెత్తారు. వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌ను సస్పెండ్ చేయాలని వీరంతా డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. అనంతరం వీరిని అరెస్టు చేసి బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Also Read: YS Sharmila Arrested: బ్రేకింగ్.. ఢిల్లీలో షర్మిల అరెస్ట్

గ్రూప్-1 పేపర్ లీక్..?

ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ప్రశ్నా పత్రం లీక్ చేసిన ప్రవీణ్ గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్-1 పరీక్ష రాశాడు. దీంతో ఆ పేపర్ కూడా లీక్ అయిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు అతడు రాసిన పరీక్షా పత్రాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ప్రిలిమ్స్ ఫలితాల్లో ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చాయి.