Telangana: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందని బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ సంపదను దోచుకున్న కేసీఆర్ ని కాపాడుతున్నట్టు ఆయన విమర్శించారు.
ఈరోజు ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ , బీఆర్‌ఎస్‌లు తెరవెనుక కుట్రలు, కుటిల రాజకీయాలకు అలవాటు పడ్డాయని ఆరోపించారు. బీజేపీ ఏదైనా బహిరంగంగా మాట్లాడుతుందని చెప్పారు. గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు , ధరణిపై సీబీఐతో విచారణ జరిపిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చాక అలాంటి ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌తో బీజేపీ ఎప్పటికీ పొత్తు ఉండదని స్పష్టం చేశారు లక్షణ్. బీజేపీ ఏం చెబితే అదే చేస్తుందని అన్నారు.
17 ఎంపీ స్థానాల్లో గెలుపు గుర్రాలను ఎన్నికల బరిలోకి దింపబోతున్నామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.