Site icon HashtagU Telugu

Telangana State: టాప్ గేర్‌లో తెలంగాణ‌- ధ‌నిక రాష్ట్రంగా అభివృద్ధి

తెలంగాణ ధ‌నిక రాష్ట్రంగా అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లోనూ గ్రోత్ క‌నిపిస్తోంది. తాజాగా విడుద‌లైన అధికారిక స్టాటిస్టిక్స్ ఈ విష‌యాన్నే చెబుతున్నాయి. 2020-21లో క‌రోనా ఇత‌ర కార‌ణాల వ‌ల్ల దేశంలో గ్రాస్ డొమ‌స్టిక్ ప్రాడెక్టు (జీడీపీ) గ్రోత్ రేటు మైన‌స్ 3కు ప‌డిపోయింది. ఒక‌ సంవ‌త్సరంలో దేశం మొత్తమ్మీద ఉత్పత్తయిన సంప‌ద‌ను జీడీపీగా వ్యవ‌హ‌రిస్తుంటారు.

తెలంగాణ‌లో స్టేట్ గ్రాస్ డొమ‌స్టిక్ ప్రాడెక్టు 2.4 శాతం మేర పెరిగింది. అది రూ.9.80 ల‌క్షల కోట్లుగా న‌మోద‌యింది. దేశంలోని అన్ని రాష్ట్రాల గ్రోత్ రేట్ల ర్యాంకుల‌ను ప‌రిశీలిస్తే తెలంగాణ‌కు మూడో స్థానం వ‌చ్చింది. మొద‌టి స్థానంలో మిజోరాం, రెండో ర్యాంకులో గుజ‌రాత్ ఉన్నాయి. మొత్తం స్టేట్ గ్రాస్ డొమ‌స్టిక్ ప్రాడెక్టు ఎన్ని కోట్ల రూపాయ‌లు అన్నది కాకుండా, గ్రోత్ రేటు ఎంత అన్నది లెక్కించిన‌ప్పుడు చిన్న రాష్ట్రమైనా మిజోరం అగ్రస్థానంలో నిల‌వ‌డం విశేషం.

త‌ల‌స‌రి ఆదాయం విషయానికి వస్తే.. అది జాతీయ స‌గ‌టు క‌న్నా తెలంగాణ లో అధికంగా ఉంది. దేశంలో త‌ల‌స‌రి ఆదాయం రూ.1,28,829 కాగా, తెలంగాణ‌లో ప‌ర్ కాపిటా ఇన్‌క‌మ్ రూ.2,37,632గా న‌మోద‌యింది. ప్రాథ‌మిక విద్యలో గ‌ణనీయ‌మైన పురోగ‌తి క‌నిపిస్తోంది. ప్రాథ‌మిక స్థాయిలో ఎక్కడా డ్రాప‌వుట్లు ఉండ‌డం లేదు. ఏడో త‌ర‌గ‌తి నుంచి కొంత‌మంది విద్యార్థులు చ‌దువులు మ‌ధ్యలో మానేస్తున్నారు. హైస్కూలు స్థాయి నుంచి ఇదొక స‌మ‌స్యగా మారుతోంది.

రాష్ట్రంలో 54 వేల మంది పిల్లలు తీవ్రమైన పౌష్టికాహార లోపంతో బాధ‌ప‌డుతుండ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. ఒక్కో జిల్లా ఒక్కో పంట‌లో స్పెష‌లైజేష‌న్ సాధిస్తుండ‌డం మ‌రో విశేషం.