Site icon HashtagU Telugu

Praja Palana : సెప్టెంబరు 17 నుంచి ‘ప్రజా పాలన’.. అర్హులందరికీ హెల్త్​ కార్డులు : సీఎం రేవంత్

CM Revanth Reddy

Praja Palana : మరో విడత ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహణకు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు రెడీ అయింది.  సెప్టెంబరు 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి  ప్రకటించారు. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

ఈసారి ప్రజాపాలన(Praja Palana) కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన  పూర్తి హెల్త్​ ప్రొఫైల్ వివరాలను సేకరించి, అందరికీ హెల్త్​ కార్డులు అందిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ప్రజాపాలనా కార్యక్రమంలో భాగంగా అర్హులైన వారందరికీ  రేషన్​ కార్డులు, హెల్త్​ కార్డులను మంజూరు చేసేందుకు వివరాలను సేకరించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని నిర్దేశించారు. ‘‘ఆరోగ్య తెలంగాణ నిర్మాణం దిశగా మేం అడుగులు వేస్తున్నాం. ప్రజల ఆరోగ్య భద్రతే మా లక్ష్యం. వైద్య రంగం అభివృద్ధికి బడ్జెట్లో రూ.11,500 కోట్లు కేటాయించాం. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. ప్రభుత్వ చర్యలతో సర్కారు దవాఖానాల్లో వైద్య సేవల నాణ్యతా ప్రమాణాలు పెరిగాయి’’ అని రేవంత్ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజలకు రేషన్ కార్డులు, ఆర్యోగ్య శ్రీ కార్డులను వేర్వేరుగా అందించాలని తెలంగాణ సర్కారు ఇప్పటికే నిర్ణయించింది.  రేషన్ కార్డులకు అర్హులను గుర్తించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌ను గోషామహల్ కు తరలిస్తామని ఈసందర్భంగా సీఎం రేవంత్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి భూ బదలాయింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 50 ఏళ్ల తర్వాత కూడా ఇబ్బందులు తలెత్తని విధంగా, అద్భుతమైన డిజైన్‌తో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించాలని సీఎం సూచించారు. అధునాతన వసతులతో, మెరుగైన వైద్య సదుపాయాలతో ఆస్పత్రి ఉండాలన్నారు.

Also Read :Abhishek Singhvi : రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్‌ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం

Exit mobile version