డా. ప్రసాదమూర్తి
తెలంగాణ (Telangana)లో ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అందరూ తమ చుట్టూ తాము తిరుగుతూ బిజెపి (BJP) చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ (BRS) పార్టీ, అధికారాన్ని కైవశం చేసుకోవడానికి కాంగ్రెస్ (Congress) పార్టీ, నువ్వా నేనా అనే రీతిలో తలపడుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య బిజెపి ఎంఐఎం కూడా తమ వంతు ప్రభావాన్ని చూపడానికి రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంఐఎం నాయకులు.. ఈ మూడు పార్టీల వారూ ఒకరినొకరు బిజెపి చుట్టూ తిరుగుతూ బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వారు మొదటి నుంచీ బీఆర్ఎస్, బిజెపి తో అంతర్గత పొత్తు కొనసాగిస్తున్నట్టు ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ దాడిని తిప్పి కొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి ఆర్ఎస్ఎస్ వాసనలు అంటగడుతూ తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. దీనికి ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా వంత పాడుతున్నారు. రేవంత్ రెడ్డి ‘ఆర్ఎస్ఎస్ పెట్’ అని ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యతో ఈ పార్టీల మధ్య జరుగుతున్న బిజెపి కేంద్రిత రాజకీయ క్రీడ రసవత్తరంగా మారింది.
ఇంతకీ ఎవరు బిజెపి మనుషులు?
బిజెపి తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవని, ఆ పార్టీ నాయకులతో సహా అందరూ ఊహిస్తున్నదే. కానీ విచిత్రంగా అధికారం కోసం పోటీ పడుతున్న వారు మాత్రం నువ్వు బిజెపి మనిషివంటే నువ్వు బిజెపి మనిషివని ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇప్పుడు ఈ రేసులో ఎంఐఎం కూడా కలిసింది. ఎన్నికల్లో బిజెపి ఎంత ప్రభావం చూపిస్తుందో తెలియదు గానీ అధికారం కోసం పోటీపడుతున్న నాయకుల్లో మాత్రం కాషాయం తంటా పెట్టడంలో గొప్ప ప్రభావమే చూపించింది అని చెప్పాలి. సోమవారం నాడు ఒక సభలో రేవంత్ రెడ్డి ఎంఐఎం నాయకుడు ఒవైసీని షేర్వానీ కింద ఖాకీ నిక్కర్ వేసుకున్న నాయకుడు అని చేసిన వ్యాఖ్య ఓవైసీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్య చేయడానికి దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీతో తలపడుతున్న ప్రతిపక్షాలతో ఎంఐఎం జతకట్టకపోవడమే కారణంగా భావించాలి. అందుకే ఎంఐఎం కి బిజెపి బీ-టీమ్ గా పేరు ఉంది. దీనికి కొనసాగింపుగానే ఎంఐఎం పైకి హిందుత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా బిజెపి మత రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడతామని చెప్పుకుంటున్నప్పటికీ అంతర్గతంగా బిజెపితో అంటగాగుతుందని విమర్శ కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో చేస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
రేవంత్ రెడ్డి తాజాగా చేసిన విమర్శకు కూడా ఇదే నేపథ్యం. అయితే దీని పట్ల తీవ్రంగా స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ వారు తమ వేషాన్ని, గెడ్డాలను విమర్శిస్తారని అంతకు మించి వారు చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు. అంతేకాదు బిజెపి కాంగ్రెస్ రెండూ ఒకటేనని కూడా ఓవైసీ ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మనిషిని, ఆయన బిజెపి చేతిలో కీలుబొమ్మ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇదంతా చూస్తుంటే తెలంగాణ ఎన్నికల్లో బిజెపి పరోక్ష రూపంలో చాలా ప్రభావమే చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఫలానా వారు బిజెపి మనిషి అని చెప్పడం ద్వారా తాము లబ్ధి పొందాలని అన్ని పార్టీల వారూ చూడడం బిజెపికి ప్లస్ పాయింటా.. మైనస్ పాయింటా.. అనేది అర్థం కాని పరిస్థితి. ఏదేమైనా ఈ ఎన్నికల ప్రచారంలో ఇతర అంశాల మాట ఎలా ఉన్నా, బిజెపి వివిధ పార్టీల ఎజెండాగా మారిపోవడం విచిత్రం. అయితే ఎంఐఎం టిఆర్ఎస్ రెండు ఉమ్మడిగా రేవంత్ రెడ్డి మీద కాషాయం ముద్ర వేయడంలో మరింత పోటీ పడడం మరింత విచిత్రం. ఎన్నికలకు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉంది. ఎవరు ఎవరి మనుషులో తేలడానికి ఇంకా ఎంతో కాలం పట్టదు. తెలంగాణలో ఏ పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంపూర్ణ మెజార్టీ రాకపోతే, ఎవరు ఎవరి వైపు నిలబడతారో దాన్ని బట్టే బిజెపి ఎవరికి గొడుగు పడుతుందో అర్థమవుతుంది. నాయకులు ఇలాగే కొట్టుకుంటారు. తినబోతూ రుచి దేనికని, ఇంకా కొన్ని రోజుల్లో అసలు విషయం చూడబోతాం కదా అంటూ సాధారణ పౌరులు మాత్రం ఈ తమాషాను చూసి వినోదిస్తున్నారు.
Read Also : KTR Praises Chandrababu: చంద్రబాబు ఫై కేటీఆర్ ప్రశంసలు..