TS Politcs: హీటెక్కుతున్న ‘తెలంగాణ’ రాజకీయాలు!

తెలంగాణ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.

  • Written By:
  • Updated On - July 28, 2022 / 12:21 PM IST

తెలంగాణ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మారుతున్న రాజకీయ సమీకరణాల్లో.. తెలంగాణలో వలసల కార్యక్రమం పెరిగేలా ఉంది.. పరిస్తితులని బట్టి నేతలు పార్టీలు మారిపోయేలా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లోకి వలస కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో శ్రావణ మాసంలో బీజేపీలోకి వలసలు మొదలవుతాయని ఈటల రాజేందర్ చెబుతున్నారు. బీజేపీలో చేరికల కమిటీ కన్వీనర్ గా ఉన్న ఆయన…టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు తమతో టచ్ లో ఉన్నారని, ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారని, త్వరలోనే వారు కాషాయ కండువా కప్పుకుంటారని అంటున్నారు. అదే సమయంలో బీజేపీలోకి వచ్చే ఎమ్మెల్యేలు.. తమ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తారని, అలాగే త్వరలో ఆరు ఉపఎన్నికలు జరుగుతాయని ఈటల బాంబ్ పేల్చారు.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి…బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. దీంతో మునుగోడు స్థానానికి ఉపఎన్నిక జరగొచ్చు. కానీ ఈటల…ఆరు ఉపఎన్నికలు అని మాట్లాడుతున్నారు..అంటే టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడానికి రెడీ అవుతున్నారా? అనే డౌట్ వస్తుంది. ఇప్పటికే తమతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారని చెబుతున్నారు.

చాలామంది ఎమ్మెల్యేలు కేసీఆర్ పై అసంతృప్తిగా ఉన్నారని, వారి బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని అంటున్నారు. అయితే శ్రావణ మాసంలో టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కేవలం మైండ్ గేమ్ మాత్రమేనా లేక నిజంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారనేది సరైన క్లారిటీ రావడం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి గాని…ఇప్పటికిప్పుడు పదవికి రాజీనామా చేసి పార్టీ మారే వారు ఉంటారనేది డౌటే…కాకపోతే ఈటలకు…టీఆర్ఎస్ నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.