Telangana Politics: బీఆర్ఎస్-కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు వేర్వేరు పార్టీలు కావని, రెండు ఒకటేనని స్పష్టం చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. తాజాగా బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కలిసి పోటీ చేస్తాయని జోస్యం చేశారు బండి. కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి చెప్తున్న దాని ప్రకారం చూస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయబోతున్నట్టు అర్ధం అవుతుందని అన్నారు బీజేపీ చీఫ్. గుంట నక్కలే గుంపులుగా వస్తాయని, బీజేపీ సింగల్‌గా వస్తుందని స్పష్టం చేశారు సంజయ్ కుమార్. ఇక టీపీసీసీ పదానికి బండి మరో అర్ధాన్నిచ్చారు. టీపీసీసీ అంటే టెయింటెడ్ పొలిటీషియన్స్ ఆఫ్ క్రైమ్ అండ్ కరప్షన్ గా పేర్కొన్నారు.
కాంగ్రెస్ గత ఎన్నికల ఫలితాలను మరిచిపోయినట్టుంది. తెలంగాణాలో అధికారం చేపడుతామని ఆ పార్టీ కలలు కంటున్నదని ఎద్దేవా చేశారు ఆయన. గతంలో తెలంగాణలో జరిగిన ఉపఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామన్న విషయాన్ని మరిచిపోయి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక పింఛన్లు, ధరణి, సంక్షేమ పథకాలపై తెలంగాణలో అనిశ్చితి సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రజల్లో అభద్రతాభావం సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు బండి. ఈ రెండు పార్టీలు తమ రాజకీయ స్వార్ధ ప్రయోజనాలకోసమే పని చేస్తున్నాయని ఆరోపించారు.
బీజేపీ రాజ్యాంగానికి కట్టుబడి ఉండే పార్టీననీ, భారతదేశం సంక్షేమ రాజ్యమని మరియు పౌరుల సంక్షేమమే ప్రధానమని బీజేపీ విశ్వసిస్తుందని తెలిపారు బండి సంజయ్. తెలంగాణలో భాజపా అధికారంలోకి రాగానే సామాజిక భద్రతా పథకాలను కొనసాగిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న అన్ని లోపాలను సరిదిద్దుతామని చెప్పారు. ఇక మా ప్రభుత్వం వస్తే రాజకీయ నాయకులు మరియు వారి కుటుంబాలకు కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా సంక్షేమ పథకాలు తీసుకొస్తామని చెప్పారు. ఇప్పుడున్న పధకాలను మరింత మెరుగుపరిచి రాష్ట్ర ప్రజలకు అందజేస్తామని హామీ ఇచ్చారు బండి సంజయ్.
Read More: Terrorist Basheer: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేసిన కెనడా భద్రతా సంస్థలు