Site icon HashtagU Telugu

YS Sharmila: వైఎస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్.. నేడు షర్మిల బెయిల్ పిటిషన్‌పై విచారణ

Sharmila

Sharmila

పోలీసులను కొట్టిన కేసులో అరెస్ట్ అయిన వైఎస్ షర్మిల (YS Sharmila)కు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులపై దాడి కేసులో షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ (Judicial Custody) విధించింది. మే 8 వరకు రిమాండ్ విధించింది. షర్మిలను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్య‌వ‌హారంలో సిట్ అధికారుల‌కు విన‌తిప‌త్రం ఇచ్చేందుకు వెళ్తున్న ష‌ర్మిల‌ను పోలీసులు అడ్డుకోవ‌డంతో ఆ స‌మ‌యంలో పోలీసుల‌పై ష‌ర్మిల చేయి చేసుకున్నారు. దీంతో ష‌ర్మిలపై 332, 353, 509, 427 సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీక్ కావడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా కొన్ని పరీక్షలు రద్దయ్యాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఇదే అంశంపై అనేక నిరసనలకు నాయకత్వం వహిస్తున్నారు. గత నెలలో హైదరాబాద్‌లో ఈ అంశంపై నిరసన తెలుపుతుండగా అరెస్టు చేశారు. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యాలయాన్ని సోమవారం షర్మిల సందర్శించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు షర్మిలను, ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు. షర్మిల ఒక మహిళా కానిస్టేబుల్ చెంపపై కొట్టారని.. ఒక ఎస్సైతో దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కల్గించారని కోర్టుకు అధికారులు వివరించారు.

Also Read: RS Praveen Kumar : తెలంగాణలో BSP పార్టీ భారీ బహిరంగసభ.. హైదరాబాద్‌కు మాయావతి

పేపర్ లీకేజీ కేసుపై సిట్ చీఫ్ ను కలవడానికి వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారని కోర్టుకు తెలిపారు ఆమె తరపు న్యాయవాది. 41సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండా షర్మిలను అక్రమంగా అరెస్ట్ చేశారని.. షర్మిలపై నమోదు చేసిన సెక్షన్స్ అన్ని ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులని చెప్పారు. అందుకే రిమాండ్ రిజెక్ట్ చేయాలని బెయిల్ పిటిషన్ కూడా వేస్తున్నామని ఆమె త‌రుపు న్యాయ‌వాది తెలిపారు. పోలీసులపై దాడి కేసులో అరెస్ట్ అయిన వైఎస్ షర్మిల బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో షర్మిలకు మే 8 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె చంచల్‌గూడ జైలులో ఉన్నారు.