TRS MLA’s : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర భ‌గ్నం.. ఫాంహౌజ్‌లో న‌లుగురు ఎమ్మెల్యేలు..!

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కుట్ర‌ను పోలీసులు భ‌గ్నం చేశారు. న‌లుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను..

  • Written By:
  • Updated On - October 27, 2022 / 07:25 AM IST

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కుట్ర‌ను పోలీసులు భ‌గ్నం చేశారు. న‌లుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్య‌క్తులు నగదుతో పట్టుబడ్డారు. అజీజ్ నగర్‌లోని ఫామ్‌హౌస్‌లో భారీ మొత్తంలో నగదుతో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డిల‌తో బేర‌సారాలు సాగిస్తుండ‌గా పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడులు నిర్వహించారు. పట్టుబడిన ముగ్గురు వ్యక్తులు నగరంలోని డెక్కన్ ప్రైడ్ హోటల్ యజమాని నంద కుమార్.. ఓ కేంద్ర మంత్రికి సన్నిహితుడని స‌మాచారం.

ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌కు చెందిన స్వామి రామచంద్ర భారతి అలియాస్ ఎస్ సతీష్ శర్మ, తిరుపతికి చెందిన సింహయాజులు సీన్‌లో ఉన్నారు. తాము బీజేపీకి చెందిన వారమని.. టీఆర్ఎస్‌ నుండి  బీజేపీలో చేరాలని కోరుతూ వారు తమను సంప్రదించారని ఎమ్మెల్యేలు త‌మ‌కు చెప్పార‌ని సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర వెల్ల‌డించారు. వారికి ప్రముఖ పదవులు, కాంట్రాక్టులు, భారీ నగదును ప్రతిఫలంగా ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేసిన‌ట్లు ఎమ్మెల్యేలు తెలిపార‌ని సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర తెలిపారు. ముగ్గురి నుండి స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని పోలీసులు ఇంకా వెల్లడించనప్పటికీ ప‌ట్టుబ‌డిన డ‌బ్బు దాదాపుగా రూ.15 కోట్లుగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. నంద కుమార్ ఈ మొత్తం ఆపరేషన్‌ను సమన్వయం చేసి మిగతా ఇద్దరిని హైదరాబాద్‌కు తీసుకువచ్చినట్లు సమాచారం. ఓ కారులో నగదు బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.