Sankranti Festival : సంక్రాంతి పండుగ వస్తోంది. ఈనేపథ్యంలో చాలామంది హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. హైవేలు ఇప్పటికే రద్దీగా మారగా.. హైదరాబాద్ రోడ్లపైనా వెహికల్స్ ప్రవాహం తగ్గిపోయింది. పండుగను(Sankranti Festival) జరుపుకునేందుకు ఊళ్లకు వెళ్తున్నామనే సంతోషం ఓ వైపు ఉండగా.. ఊళ్లకు వెళ్లిపోయాక ఇళ్లలో దొంగలు పడతారేమోననే భయం మరోవైపు ప్రజలను వేధిస్తోంది. ఈతరుణంలో ప్రజల ఇళ్లలో భద్రతను పెంచేందుకు తెలంగాణ పోలీసులు కొన్ని జాగ్రత్త చర్యలను సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
పోలీసుల సూచనలివీ..
- మీ ఇంటి ఇరుగుపొరుగు వారికి మీ ప్రయాణం వివరాలు చెప్పండి. ఎప్పుడు వెళుతున్నది, ఎప్పుడు తిరిగొచ్చేది చెప్పి మీ ఇంటిపై ఓ కన్నేసి ఉంచాలని కోరండి. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే మీకు ఫోన్ చేసి చెప్పాలని సూచించండి.
- ఇంట్లో వదిలివెళ్లే విలువైన ఆభరణాల వివరాలు కానీ వస్తువుల వివరాలపై కానీ బహిరంగంగా చర్చించుకోవడం చేయొద్దు. నగలు, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో జాగ్రత్తగా దాచిపెట్టండి. బయటకు కనిపించకుండా జాగ్రత్త పడండి.
- ఇంట్లో సీసీటీవీ కెమెరాను అమర్చుకోవడం మంచిది. దీనివల్ల మీరు ఎక్కడున్నా మొబైల్ ఫోన్ తో ఇంటిపై ఓ కన్నేసి ఉంచవచ్చు. దొంగల భయం లేకుండా నిశ్చింతగా ఉండొచ్చు.
- మీ నివాసంలోని బీరువా తాళాలను మీతోనే తీసుకెళ్లండి. ఇంటికి తాళం వేశాం కదా అని నిర్లక్ష్యంతోనో ఎక్కడైనా పోతాయనే భయంతోనో ఇంట్లో వదిలి వెళ్లొద్దు.
- మీ నివాసానికి మంచి నాణ్యత కలిగిన తాళం వేయండి. డోర్ కు వేసిన తాళం కనిపించకుండా పై నుంచి కర్టెన్ వేయడం శ్రేయస్కరం. ఇంట్లో ఎవరూ లేరనే విషయం చూసే వాళ్లకు ఇట్టే తెలిసిపోకుండా ఇది ఉపయోగపడుతుంది.
- మీ ఇంటి మెయిన్ హాల్ లో ఓ లైట్ వేసి ఉంచడం ద్వారా ఇంట్లో ఎవరైనా ఉన్నారనే భ్రమ కలిగించవచ్చు. కొంతవరకు ఇది దొంగలను మీ ఇంటికి దూరం పెడుతుంది.
Also Read: Retired DGP Baburao : దళిత ముద్దుబిడ్డ, రిటైర్డ్ డీజీపీ బాబూరావుకు ఫ్రాన్స్ వర్సిటీ గౌరవ డాక్టరేట్
సంక్రాంతి పండగ నేపథ్యంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ పెరిగింది. టోల్ ప్లాజాల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఒక్కటి కాదు.. రెండు కాదు వేల సంఖ్యలో వాహనాలు వచ్చి టోల్ ప్లాజాల వద్ద వెయిట్ చేస్తుండటం కనిపిస్తోంది. పంతంగి ప్లాజా వద్ద విజయవాడ వెళ్లే వైపు పది గేట్లను ఎత్తి వేసినా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాహనాలు కూడా నెమ్మదిగానే బయలుదేరుతున్నాయి. సంక్రాంతి పండగ కోసం విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే వాహనాలన్నీ ఇటే వస్తుండటంతో ట్రాఫిక్ ను పోలీసులు కూడా నియంత్రించ లేకపోతున్నారు. టోల్ ప్లాజాల వద్ద పోలీసులను ప్రత్యేకంగా నియమించినా కార్లలో వస్తుండటంతో వారిని కంట్రోల్ చేయలేక చేతులెత్తేస్తున్నారు.