AP vs Telangana : ఏపీ పోలీసుల‌పై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు.. కార‌ణం ఇదే..?

ఏపీ పోలీసుల‌పై తెలంగాణ పోలీసులు రెండు కేసులు న‌మోదు చేశారు. నాగార్జున సాగర్‌ డ్యామ్‌లో సగభాగాన్ని ఏపీ పోలీసులు

  • Written By:
  • Publish Date - December 2, 2023 / 07:08 AM IST

ఏపీ పోలీసుల‌పై తెలంగాణ పోలీసులు రెండు కేసులు న‌మోదు చేశారు. నాగార్జున సాగర్‌ డ్యామ్‌లో సగభాగాన్ని ఏపీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారని, ఇరిగేష‌న్ అధ‌కారుల‌ను, తెలంగాణ పోలీసుల‌ను అడ్డుకున్నార‌ని కేసులు న‌మోదు చేశారు. నవంబర్ 29, నవంబర్ 30 మధ్య రాత్రి, నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ డ్యామ్ సైట్ వద్ద తెల్లవారుజామున 1 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ నుండి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు ప్రవేశించారు. డ్యామ్ వ‌ద్ద స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF)ని ఏపీ పోలీసులు పక్కకు నెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రెండు రాష్ట్రాల పోలీసుల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 26 గేట్లు ఉన్న డ్యామ్‌లో సగం భాగాన్ని ఏపీ పోలీసు బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాని చుట్టూ బారికేడ్లు, ముళ్ల తీగలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏపీ ఇరిగేషన్ అధికారులు కూడా కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేశారని తెలంగాణ పోలీసులు తెలిపారు. తమను ఏపీ పోలీసులు అడ్డుకున్నారని ఎస్పీఎఫ్ అధికారి తెలిపారు. రెండో ఫిర్యాదు ఏపీ పోలీసులపై తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు దాఖలు చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో తెలంగాణ నుంచి అదనపు పోలీసు సిబ్బందిని డ్యామ్ వ‌ద్ద మోహరించినట్లు పోలీసు ఉన్న‌తాధికారులు తెలిపారు. కృష్ణా నదిపై నిర్మించిన నాగార్జున సాగర్ డ్యాం తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉందని వారు తెలిపారు.

Also Read:  Andhra Pradesh : ప్రత్తిపాడులో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీపీలు