Site icon HashtagU Telugu

Social Media : సోష‌ల్ మీడియా ఎన్నారైలకు సంకెళ్లు

విద్వేష‌పూరిత‌, అవ‌మాన‌క‌ర వార్త‌ల‌ను సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేసే ఎన్నారైల పాస్ పోర్ట్ ల‌ను ర‌ద్దు చేయాల‌ని తెలంగాణ పోలీస్ నిర్ణ‌యించింది. తెలంగాణ‌కు చెందిన ప‌లువురు ఎన్నారైలు సోష‌ల్ మీడియా వేదిక‌గా రాజ‌కీయ చ‌ర్చ‌ల్లో వివాదంగా నిలుస్తున్నార‌ని హైద‌రాబాద్ పోలీసులు గుర్తించారు. వాళ్ల‌పై కేసులు న‌మోదు చేసి లుకౌట్ నోటీసులు జారీ చేయాల‌ని హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న్ సీవీ ఆనంద్ ఆదేశించాడు. అనుచిత వ్యాఖ్య‌లు, విద్వేషం రేపేలా పోస్టులు పెడుతున్న ఎన్నారైల‌ పోర్టుల‌ను స్వాధీనం చేసుకోవ‌డంతో పాటు వీసాల‌ను చ‌ట్ట ప్ర‌కారం ర‌ద్దు చేయడానికి సిఫార‌స్సు చేస్తామ‌ని హెచ్చ‌రించాడు.తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకుగానూ తెలంగాణకు చెందిన కనీసం 40 మంది జర్నలిస్టులు మరియు యూట్యూబ్ కంటెంట్ సృష్టికర్తలను రాష్ట్ర పోలీసులు జనవరి 6న అదుపులోకి తీసుకుని విచారించిన విష‌యం విదిత‌మే. ఎటువంటి నోటీసు లేకుండా అదుపులోకి తీసుకున్నార‌ని కంటెంట్ సృష్టికర్తలు ఆరోపిస్తున్నారు. ఫోన్లను కూడా పోలీసులు తీసుకుని ఫార్మాట్ చేశారని ఇంకొందరు వినిపిస్తోన్న ఆరోప‌ణ‌లు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని హెచ్చరించడంతో పోలీసులు అర్ధరాత్రి వ‌దిలిపెట్టారని ఓ సోష‌ల్ మీడియా రిపోర్ట‌ర్ చెబుతున్నాడు.

కాళోజీ టీవీ అనే యూట్యూబ్ ఛానెల్‌ని నిర్వహిస్తున్న దాసరి శ్రీనివాస్‌పై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప‌లు సెక్ష‌న్ల కింద ఎఫ్ ఐఆర్ త‌యారు చేశారు.ఎమ్మెల్సీ కవిత ఆస్తులకు సంబంధించిన సమాచారం గురించి పోలీసులు విచార‌ణ చేశార‌ని మ‌రో జ‌ర్న‌లిస్ట్ చెబుతున్నాడు.అనుమతి లేకుండా ఛానెల్స్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై యూట్యూబ్ ఛానెల్స్ జీఎస్‌ఆర్ టీవీ తెలుగు, రైట్ వాయిస్ నిర్వహిస్తున్న జి. శివరామ్, ప్రవీణ్ రెడ్డిలను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్ వాయిస్‌పై ఒక కేసు, జీఎస్‌ఆర్ టీవీ తెలుగుపై నాలుగు కేసులను పెట్టారు.అరెస్టుల గురించి కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ మాట్లాడుతూ, “వ్యక్తులు, సెలబ్రిటీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని పెంచే పోస్టులు చేస్తున్నారు. ఐటీ చట్టం ప్రకారం ఇది నేరమ‌ని వివ‌రించాడు. అరెస్ట్ అయిన వాళ్లు ఏ మీడియా సంస్థలోనూ నమోదు చేసుకోలేదని సత్యనారాయణ తెలిపారు. “వారికి అక్రిడిటేషన్ లేదు . సమాచార మరియు పౌరసంబంధాల శాఖ అనుమతి లేదని ఆయ‌న వివ‌రించాడు. మొత్తం మీద సోష‌ల్ మీడియాపై తెలంగాణ స‌ర్కార్ నిఘా పెట్టింది. పోలీసులు కూడా ప్ర‌త్యేక టీంల‌తో యూట్యూబ్‌, వెబ్ సైట్ల పై నిఘా పెట్టారు. ఫ‌లితంగా స్వీయ‌నియంత్ర‌ణలేని సోష‌ల్ మీడియాకు కూడా సంకెళ్లు త‌ప్ప‌వు.