Liquor scam:క్విడ్ ప్రో కో `కేస్ `షీట్‌!!

`క్విండ్ ప్రో కో ` ప‌దం తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు గ‌త ద‌శాబ్ద‌కాలంగా బాగా ప‌రిచ‌యం. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆస్తుల కేసు సీబీఐ ఫైల్ చేసిన‌ప్ప‌టి నుంచి ఆ ప‌దానికి ప్రాధాన్యం పెరిగింది.

  • Written By:
  • Updated On - December 3, 2022 / 02:42 PM IST

`క్విండ్ ప్రో కో ` ప‌దం తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు గ‌త ద‌శాబ్ద‌కాలంగా బాగా ప‌రిచ‌యం. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆస్తుల కేసు సీబీఐ ఫైల్ చేసిన‌ప్ప‌టి నుంచి ఆ ప‌దానికి ప్రాధాన్యం పెరిగింది. `నీ క‌ది నాకిది` అనే సూత్రం ఆర్థిక అంశాల్లో విన్నాం. కానీ, ఇప్పుడు కేసుల విష‌యంలోనూ `క్విడ్ ప్రో కో ` న‌డుస్తోంద‌ని కాంగ్రెస్ చెబుతోంది. కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య లిక్క‌ర్ స్కామ్, ఎమ్మెల్యేల‌కు ఎర కేసులు `చెల్లుకు చెల్లు` అన్న‌ట్టుగా ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య జ‌రుగుతోన్న కేసుల వ్య‌వ‌హారాన్ని డ్రామాగా కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి అభివ‌ర్ణిస్తున్నారు. అందుకే, ఆ రెండు పార్టీల అవినీతి మీద క్షేత్ర‌స్థాయి పోరాటానికి తెలంగాణ కాంగ్రెస్ దిగుతుంద‌ని వెల్ల‌డించ‌డం సరికొత్త రాజకీయానికి తెర‌లేప‌నుంది.

కేసుల విష‌యంలోనూ క్విడ్ ప్రో కో న‌డుస్తుందా? అంటే కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను ఉదాహ‌ర‌ణ‌గా తీసుకోవ‌చ్చు. వాటిలో ప్ర‌ధానంగా ఓటుకు నోటు కేసును అవ‌లోక‌నం చేసుకోవ‌చ్చు. తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తొలి ఏడాది పూర్తి కాకుండానే కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని కూల్చ‌డానికి ప్ర‌య‌త్నం జ‌రిగిందని ఆనాడు టీఆర్ఎస్ చెప్పిన మాట‌. ఆ క్ర‌మంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు డ‌బ్బు ఇచ్చే క్ర‌మంలో టీడీపీ అధికార ప్ర‌తినిధిగా ఉన్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ఏసీబీ ప‌ట్టుకుంది. ఆ కేసును చంద్ర‌బాబు మెడ‌కు చుట్టారు. ఆయ‌న వాయిస్ రికార్డ్ ఉందంటూ తెలంగాణ ఏసీబీ కేసును త‌యారు చేసింది. ప్ర‌తిగా ఫోన్ ట్యాంప‌రింగ్ కేసును ఏపీ పోలీస్ న‌మోదు చేసి ఢీ అంటే ఢీ అనేలా రెడీ అయింది. ఇరు రాష్ట్రాల మ‌ధ్యా ఆ రెండు కేసులు కొంత కాలం పాటు టెన్ష‌న్ వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేశాయి. ఆ త‌రువాత చంద్ర‌బాబు అమ‌రావ‌తికి పూర్తిగా మ‌కాం మార్చ‌డంతో పాటు తెలంగాణకు దూరంగా ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా విజ‌య‌వాడ వెళ్లి చంద్ర‌బాబు ఇచ్చిన విందు స్వీక‌రించారు. దీంతో ఆ రెండు కేసుల‌ ద‌ర్యాప్తు ఆగిపోయింది. ఓటుకు నోటు కేసు కాల‌క్ర‌మంలో బుట్టదాఖ‌లు అయింది.

సేమ్ టూ సేమ్ ఇప్పుడు ఓటుకు నోటు కేసు త‌ర‌హాలోనే బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య డ్రామా న‌డుస్తోంద‌ని కాంగ్రెస్ విశ్వ‌సిస్తోంది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ నెల రోజుల క్రితం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎమ్మెల్సీ క‌విత ప్ర‌మేయం గురించి బీజేపీ ఢిల్లీ నేత‌లు ఆధారాల‌ను బ‌య‌ట పెట్టారు. అయిన‌ప్ప‌టికీ కేసు ద‌ర్యాప్తులో ఎక్క‌డా క‌విత ను ట‌చ్ చేయ‌లేదు. అదే స‌మ‌యంలో ఫామ్ హౌస్ కేంద్రంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారాన్ని తెలంగాణ ఏసీబీ బ‌య‌ట‌పెట్టింది. నిందితుల‌ను అరెస్ట్ చేసి కోర్టు ద్వారా నిందితుల‌ను జైలుకు పంపింది. నిందితులు బీజేపీ అగ్ర‌నేత‌ల‌తో ప‌రిచ‌యం ఉన్న వాళ్ల‌ని, ఈ మొత్తం వ్య‌వ‌హారంలో బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్ ఉన్నాడ‌ని కేసీఆర్ ఏర్పాటు చేసిన పోలీస్ సిట్ నిర్థారించింది. ఆ మేర‌కు నోటీసులు జారీ చేయ‌డంతో పాటు మోడీ స‌ర్కార్ మీద కేసీఆర్ దేశ వ్యాప్తంగా ఉన్న ప‌లు వ్య‌వ‌స్థ‌ల‌కు ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించిన ఆధారాల‌ను పంపారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ రాద్దాంతాన్ని చేయ‌డంతో బీజేపీ అగ్ర‌నేత‌ల‌కు ఆగ్ర‌హం క‌లిగింది. ఫలితంగా సీబీఐ వేసిన చార్జిషీట్ లో లేని క‌విత పేరును ఆరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ చేర్చింది.

ప్ర‌స్తుతం ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ క‌విత మెడ‌కు బాగా చుట్టుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో బీజేపీ అగ్ర‌నేత బీఎల్ సంతోష్ మెడ‌కు ఎమ్మెల్యేల ఎర కేసును తెలంగాణ సిట్ బాగా బిగించింది. ఈ రెండు కేసులు సీరియ‌స్ గా న‌డుస్తోన్న స‌మ‌యంలోనే ఎమ్మెల్యేల‌కు ఎర కేసుకు సంబంధించి జైలులో ఉన్న ముగ్గురు నిందితుల‌కు బెయిల్ మంజూరు అయింది. అయితే , విచిత్రంగా వాళ్ల‌కు 6ల‌క్ష‌లు పూచిక‌త్తు ఇచ్చి తీసుకురావ‌డానికి డ‌బ్బు లేక‌పోవ‌డంతో వాళ్లు ఇప్ప‌టికీ జైలులోనే ఉన్నారు. ఆ ముగ్గురు నిందితుల‌కు బీజేపీ అగ్ర‌నేత‌ల‌తో సంబంధాలు ఉన్నాయ‌ని టీఆర్ఎస్ చేసిన ఆరోప‌ణ‌. అలాంటప్పుడు రూ.6 ల‌క్ష‌లు పూచిక‌త్తు ఇచ్చి జైలు నుంచి బ‌య‌ట‌కు తీసుకురాలేని స్థితిలో బీజేపీ అగ్ర‌నేత‌లు ఉన్నారా? అనే చ‌ర్చ ఇప్పుడు జ‌రుగుతోంది. ఇదే పెద్ద డ్రామా అంటూ బీజేపీ మీద కాంగ్రెస్ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇక ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో నిందితురాలిగా ఉన్న క‌విత‌ను ఈనెల 6వ తేదీ విచారించ‌డానికి సీబీఐ సిద్దం అయింది. ఆ రోజున ఆమెను అదుపులోకి తీసుకుంటారా? లేక విచార‌ణ చేసి వ‌దిలేస్తారా? అనేది సందిగ్ధం.

ఎమ్మెల్యేల ఎర కేసులో ముగ్గుర్ని తెలంగాణ పోలీసులు జైలుకు పంపారు కాబ‌ట్టి `టిట్ ఫ‌ర్ టాట్` అనేలా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లోనూ శ‌ర‌త్ చంద్రారెడ్డి, బోయిన ప‌ల్లి సంతోష్ త‌దిత‌రుల‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఒక వేళ క‌విత‌ను కూడా జైలుకు పంపిస్తే బ‌దులుగా తెలంగాణ సిట్ బీజేపీ అగ్ర‌నేత సంతోష్ ను వెటాడ‌నుంది. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చిన తెలంగాణ సిట్ కోర్టు ఆదేశం కోసం చూస్తోంది. ఆ లోపుగా దేశం విడిచి వెళ్ల‌కుండా రెడ్ కార్న‌ర్ నోటీసులు ఇవ్వ‌డం జ‌రిగింది. అంటే, క‌విత కేసు వేగ‌వంతం అయితే సంతోష్ విచార‌ణ వేగం అయ్యే అవ‌కాశం ఉంది. లేదంటే క‌విత విచార‌ణ‌కు, సంతోష్ విచార‌ణ‌కు చెల్లుకు చెల్లు అన్న‌ట్టు బీజేపీ, టీఆర్ఎస్ ఈ రెండు కేసుల‌ను బుట్ట‌దాఖ‌లు చేస్తాయ‌ని కాంగ్రెస్ భావిస్తోంది. ఓటుకు నోటు కేసు త‌ర‌హాలోనే ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌, ఎమ్మెల్యేల‌కు ఎర కేసులు `క్విడ్ ప్రో కో` ఫార్ములాతో ముగుస్తాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది