Site icon HashtagU Telugu

1300 Phones Tapped : నాలుగు నెలల్లో 1300 ఫోన్లు ట్యాప్ చేశారు

Phone Tapping Case

1300 Phones Tapped : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయానికి భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేశారని తెలుస్తోంది. ప్రత్యేకించి ఆగస్టు నుంచి నవంబరు చివరి వరకు కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే 1,300 ఫోన్లను స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) ద్వారా బీఆర్ఎస్ సర్కారు ట్యాప్ చేయించిందని దర్యాప్తులో తేలింది. ఆ వ్యవధిలో ప్రతిరోజు సగటున 10కిపైగా ఫోన్లను ట్యాప్ చేయడం గమనార్హం. చివరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబరు 30న జరిగిన వెంటనే ఫోన్‌ ట్యాపింగ్‌ ఆట ఆగిందని తేలింది. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చేందుకు.. విపక్ష పార్టీల నేతలను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు బృందం ఫోన్ ట్యాపింగ్ తతంగాన్ని నడిపించిందని దర్యాప్తులో గుర్తించారు.

We’re now on WhatsApp. Click to Join

బీఆర్ఎస్ అభ్యర్థులపై పోటీ చేస్తున్న ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచడం,  వారి అనుచరుల కార్యకలాపాల్ని పసిగట్టేందుకు ఫోన్ ట్యాపింగ్‌ను వాడుకున్నారు. ప్రతిపక్ష అభ్యర్థుల ఆర్థిక వనరులను అడ్డుకునే దిశగా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ  ప్లాన్లు అమలు వేశారు. రాష్ట్రంలో చాలాచోట్ల విపక్ష అభ్యర్థుల సొమ్మును, సొత్తును జప్తు చేయడంలో ఈ ఫోన్ ట్యాపింగే కీలక పాత్ర పోషించదని అధికార వర్గాలు తెలిపాయి. ఆనాడు వందలాదిగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ ల చిట్టా ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వద్ద ఉంది.  ఆనాడు ఫోన్ ట్యాపింగ్‌కు బాధితులుగా మారిన వారికి దీనిపై ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు సమాచారాన్ని అందిస్తున్నారు. వారి నుంచి స్టేట్‌మెంట్లను సేకరించి నమోదు చేసుకుంటున్నారు.  బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్(1300 Phones Tapped) చేసిన తీరును న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈక్రమంలోనే బాధితుల వాంగ్మూలాలను కూడగట్టే ప్రక్రియను  వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.

Also Read : TPCC Chief : కాబోయే తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరు ? రేసులో దిగ్గజ నేతలు