Paddy Issue : ధాన్యం కొనుగోళ్ల అంశం చుట్టూ 4 పార్టీలు.. 3 కోట్ల ఓట్ల లెక్క.. అధికారం ఎవరికి పక్కా?

తెలంగాణలో రాజకీయ సందడి పెరిగింది. బీజేపీ, ఆప్, కాంగ్రెస్.. అన్నీ ఈ గడ్డమీద గెలుపు జెండా ఎగరేయడానికి క్యూ కడుతున్నాయి. అందుకే అప్పుడే ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. జాతీయ పార్టీలన్నీ తెలంగాణపైనే ఎందుకు ఫోకస్ పెడుతున్నాయి?

  • Written By:
  • Publish Date - March 29, 2022 / 11:42 AM IST

తెలంగాణలో రాజకీయ సందడి పెరిగింది. బీజేపీ, ఆప్, కాంగ్రెస్.. అన్నీ ఈ గడ్డమీద గెలుపు జెండా ఎగరేయడానికి క్యూ కడుతున్నాయి. అందుకే అప్పుడే ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. జాతీయ పార్టీలన్నీ తెలంగాణపైనే ఎందుకు ఫోకస్ పెడుతున్నాయి? ఆంధ్రప్రదేశ్ లోని లేనిది తెలంగాణలో ఏముంది? తరచి చూస్తే.. చాలా అంశాలు కనిపిస్తాయి. అందుకే ఏప్రిల్ నెలలో ఈ పార్టీల అగ్రనేతలు రాష్ట్రానికి వచ్చి.. పరిస్థితులను తమ గ్రిప్ లోకి తెచ్చుకోవడానికి వ్యూహాలను పన్నుతున్నారు.

తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ ధాన్యం కొనుగోళ్లు అంశం. ఇది రాష్ట్రంలో ఉన్న దాదాపు 58 లక్షల మంది రైతులతో ముడిపడి ఉంది. అందుకే పార్టీలన్నీ దీనిపై ఫోకస్ పెట్టాయి. 58 లక్షల మంది రైతులంటే ఒక్కో కుటుంబంలో తక్కువలో తక్కువ మూడు ఓట్లు వేసుకున్నా.. కోటీ 75 లక్షల మందిపై ప్రభావం చూపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది మూడు కోట్ల ఓటర్లు. అంటే సగంమంది ఓటర్ల కన్నా ఎక్కువమందిపై ధాన్యం కొనుగోళ్ల అంశం ప్రభావం చూపిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. తెలంగాణలో దాదాపు 55 శాతం మంది జనాభాకు జీవనాధారం వ్యవసాయమే. అందుకే పార్టీలన్నీ రైతుల అంశంపై ఇంత శ్రద్ధ చూపిస్తున్నాయి.

కోట్లమందితో ముడిపడిన అంశం కనుకే.. ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని బేసే చేసుకుని తెలంగాణలో పట్టు పెంచుకోవడానికి పార్టీలన్నీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఐదంచెల ఉద్యమ కార్యాచరణతో ముందుకు వెళుతోంది. ఏప్రిల్ నెలలో దాని పోరాట అజెండా అంతా ఇదే. ఈ పోరాటంపై ముగింపు సభను వరంగల్ లో ప్లాన్ చేస్తున్నారు. దీనికి రాహుల్ గాంధీని రప్పించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. డిసెంబర్ 9న నిరుద్యోగ సమస్యపై భారీ బహిరంగ సభను నిర్వహించడానికి ప్లాన్ చేసిన రేవంత్.. దానికి రాహుల్ రప్పించడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. గతంలో కొన్నిసార్లు రాహుల్ ని రప్పించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అందుకే ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ రాహుల్ ను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికలకు ఇది బూస్ట్ ఇస్తుందని టీపీసీసీ ఆశ.ఇలాంటి లెక్కలు వేయడంలో బీజేపీ దిట్ట. అందుకే తన స్పీడు పెంచింది. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.. తన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను ఏప్రిల్ 14న స్టార్ట్ చేస్తారు. దీని ఓపెనింగ్ కు అమిత్ షాను రప్పించడానికి ప్లాన్ చేస్తున్నారు. భద్రాచలంలో సీతారామ కల్యాణానికి అమిత్ షాను రమ్మని కూడా కోరుతోంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. అదైతే.. సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందని ఆశపడుతోంది.

అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇదే అజెండాతో అడుగులు వేస్తోంది. ఇప్పటికే కేజ్రీవాల్ పాదయాత్రకు ప్లాన్ చేశారు. ఢిల్లీ, పంజాబ్ లో తమ పాలనను చూపిస్తూ.. ఆయన తెలంగాణలో కూడా ఛాన్స్ అడిగే అవకాశం ఉంది. ఈ పార్టీ నేతలు కూడా ఏప్రిల్ 14 నుంచే పాదయాత్రను చేయడానికి రంగం సిద్ధం చేశారు. దీని ఓపెనింగ్ కు కేజ్రీవాల్ రాబోతున్నారు. అదే సమయంలో కొందరు ముఖ్యనేతలు.. ఆప్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, ఆప్.. ఈ మూడు పార్టీలు ఏప్రిల్ నెలలో సందడి చేయబోతున్నాయి. రాష్ట్రంలో భానుడి భగభగలతో పోటీ పడుతూ రాజకీయ సెగలను రాజేయబోతున్నాయి. మరి వీటిని ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ ఎలాంటి అస్త్రాలను సిద్ధం చేసుకుని ప్రయోగిస్తుందో చూడాలి. మొత్తానికి తెలంగాణలో రాజకీయం మాత్రం రంజుగా మారింది.