Site icon HashtagU Telugu

Telangana Ooty: తెలంగాణ ఊటీ రమ్మంటోంది.. కనువిందు చేస్తున్న అనంతగిరి అందాలు!

Ananthagiri

Ananthagiri

తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు లోతట్టు ప్రాంతాలు బురదమయంగా మారి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంటే, మరికొన్ని ప్రాంతాలు ఆకుపచ్చ సోగాయాలతో రారమ్మని పిలుస్తున్నాయి. వర్షపు నీటితో జాలువారుతూ, ఆకుపచ్చని ద్రుశ్యాలతో ఆహ్వానిస్తున్నాయి. వికారాబాద్‌లోని పచ్చటి ప్రకృతికి నిలయం, జిల్లాకే ప్రత్యేకం.. అనంతగిరి కొండలు. కొద్దిపాటి వర్షం పడినా అటవీ ప్రాంతమంతా ఆకుపచ్చమయం అయిపోతుంది. ఇక వరుస వర్షాలు పడితే కొండల్లోంచి జలపాతాలు జాలువారుతూ గలగల సవ్వడులతో సందడి చేస్తాయి. ప్రస్తుతం అనంతగిరి కొండల్లో నెలకొన్న ఇలాంటి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించేందుకు సందర్శకులు తరలి వస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘అనంతగిరి కొండలు’ ప్రకృతి అందాలకు నెలవు. దాదాపు 3,763 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ అడవి అందాలతో అబ్బుర పరుస్తోంది. ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా ఉన్న ఈ ప్రాంతంలోని కొండలు, అడవి అందాల మధ్య 1300 సంవత్సరాల చరిత్ర గల ‘అనంత పద్మ నాభస్వామి ఆలయం’ అందరినీ ఆకర్షిస్తోంది. అనంతగిరిని ‘తెలంగాణ ఊటీ’గా చెప్పవచ్చు. ఈ కొండల పైనుండి నీరు ఒస్మానాసాగర్ మరియు అనంత సాగర్‌కు ప్రవహిస్తాయి. ఇక్కడి అడవులు తెలంగాణ రాష్ట్రంలోనే దట్టమైనవి. హైదరాబాదు నుండి ప్రవహిస్తున్న మూసీ నదికి అనంతగిరి కొండలే జన్మస్థానం.

అనంతగిరి కొండలను, అక్కడే కొలువుదీరిన అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని చూసేందుకు పర్యాటకులే రావడం లేదు. టాలీవుడ్ టూ బాలీవుడ్ సినిమా షూటింగ్‌లకు ఇక్కడి ప్రాంతాలు అనువైనవని సినీ నిర్మాతలు, దర్శకులూ ఈ ప్రాంతం పట్ల ఆసక్తి చూపుతున్నారు.. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో సినీ ప్రముఖులు ఇక్కడి అందమైన లొకేషన్స్‌పై మక్కువ చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో పాటు సహజత్వానికి వీలుండటమే ఇందుకు కారణం. దశాబ్దకాలంగా నిర్మితమైన సినిమాల్లో దాదాపు 60 శాతానికి పైగా ఇక్కడ షూటింగ్ చేసినవే కావడం విశేషం. మొదట్లో చిన్న సినిమాలకే పరిమితమైనా.. నేడు అగ్ర హీరోల షూటింగ్‌లు అనంతగిరి కొండల్లో జరుగుతున్నాయి.

Also Read: Heavy Rains: భారీ వర్షాలతో జర జాగ్రత్త