KCR Tamilisai : కేసీఆర్, త‌మిళ సై `స‌యోధ్య` టైమ్‌!

తెలంగాణ సీఎం కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై న‌డుమ సాగుతోన్న డైరెక్ట్ వార్ కు కొత్త చీఫ్ జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భుయాన్ ప్ర‌మాణం స్వీకారం తెర‌వేయ‌నుందా? అంటే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. ఆ రోజున సీఎం హోదాలో కేసీఆర్ ప్రొటోకాల్ ప్ర‌కారం హాజ‌రు కావాలి.

  • Written By:
  • Publish Date - June 25, 2022 / 07:30 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై న‌డుమ సాగుతోన్న డైరెక్ట్ వార్ కు కొత్త చీఫ్ జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భుయాన్ ప్ర‌మాణం స్వీకారం తెర‌వేయ‌నుందా? అంటే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. ఆ రోజున సీఎం హోదాలో కేసీఆర్ ప్రొటోకాల్ ప్ర‌కారం హాజ‌రు కావాలి. ప్ర‌మాణస్వీకారోత్స‌వాన్ని గ‌వ‌ర్న‌ర్ హోదాలో త‌మిళ సై రాజ‌భ‌వ‌న్ కేంద్రంగా ఏర్పాటు చేస్తారు. ఆమె ప్ర‌మాణ‌స్వీకారం చేయిస్తారు. ఆ సంద‌ర్భంగా ఇప్ప‌టి వ‌ర‌కు దూరంగా ఉంటోన్న సీఎం, గ‌వ‌ర్న‌ర్ లు ఒకే వేదిక‌పై క‌నిపిస్తార‌ని ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ర్గాల నుంచి వినిపిస్తోన్న టాక్.

తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ జూన్ 28న ఉద‌యం 10 గంట‌ల‌కు రాజ్‌భవన్‌లో ప్రమాణం చేస్తారు. తెలంగాణ హైకోర్టు ఐదవ ప్రధాన న్యాయమూర్తిగా ఆయ‌న బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు. ఇప్ప‌టి వ‌ర‌కు చీఫ్ జ‌స్టిస్ ల ప్ర‌మాణ‌స్వీకారానికి సీఎం కేసీఆర్ హాజ‌రయ్యారు. ప్ర‌స్తుతం గ‌వ‌ర్న‌ర్, సీఎం మ‌ధ్య న‌డుస్తోన్న ప్రొటోకాల్ యుద్ధం రాజ్ భ‌వ‌న్ వేదిక‌గా మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశం కానుంది.

గ‌వ‌ర్న‌ర్ గా బాధ్య‌తలు స్వీక‌రించిన త‌రువాత త‌మిళ సై నేరుగా ప్ర‌భుత్వం కార్యక‌లాపాల్లో జోక్యం చేసుకున్నారు. ప్ర‌భుత్వ విభాగాల నుంచి స‌మాచారం సేక‌రించారు. ప్ర‌జాద‌ర్బార్ల‌ను నిర్వ‌హించ‌డానికి ప్ర‌త్యేక ఫిర్యాదుల బాక్స్ ను పెట్టారు. యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ల‌తో నేరుగా స‌మావేశాల‌ను పెడుతూ విద్యా వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. అదే విధంగా స్వ‌త‌హాగా డాక్ట‌ర్ అయిన త‌మిళ సై వైద్య రంగాన్ని స‌మీక్షించే ప్ర‌య‌త్నం చేశారు. కోవిడ్ సందర్భంగా ఆస్ప‌త్రుల ప‌నితీరుపై ఆమె సమీక్షించిన సంద‌ర్భం ఉంది. తెలంగాణ ప్ర‌భుత్వం వాల‌కాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్రానికి చేర‌వేస్తున్నారు. ఇటీవ‌ల కేంద్రానికి, రాష్ట్రానికి మ‌ధ్య సంబంధాలు చెడిపోవ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్యా గ్యాప్ మ‌రింత పెరిగింది. ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ‌ద్ద‌కు వెళ్లి కేసీఆర్ పాల‌న మీద గ‌వ‌ర్న‌ర్ ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ ప్ర‌కారం ఇవాల్సిన గౌర‌వం తెలంగాణ సీఎం ఇవ్వ‌డంలేద‌ని ఆధారాల‌తో స‌హా అంద చేశారు.

గ‌ణ‌తంత్ర్య దినోత్స‌వాల‌కు రాజ్ భ‌వ‌న్ వెళ్ల‌కుండా కేసీఆర్ దూరంగా ఉన్నారు. అంతేకాదు, మంత్రులు, కీల‌క అధికారులు కూడా రాజ్ భ‌వ‌న్ కు దూరం జ‌రిగారు. స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర‌కు వెళ్ల‌డానికి హెలికాప్ట‌ర్ ను ఇవ్వాల్సిన రాష్ట్ర ప్ర‌భుత్వం ఆమెకు స‌మ‌కూర్చ‌లేదు. రోడ్డు మార్గాన అక్క‌డికి వెళ్లిన ఆమెకు అధికారులు ప్రోటాకాల్ ప్రకారం స్వాగ‌తం ప‌ల‌క‌లేదు. దీంతో వాళ్లిద్ద‌రి మ‌ధ్యా ప్ర‌చ్చ‌న్నంగా న‌డిచిన యుద్ధం ఇటీవ‌ల డైరెక్ట్ అయింది. ఢిల్లీలో కేసీఆర్ వాల‌కాన్ని త‌మిళ సై ఏక‌రువు పెట్టారు. ప్ర‌భుత్వంలోని అవినీతి గురించి కొన్ని ఫైళ్ల‌ను కూడా అందించార‌ని తెలుస్తోంది. రాజ్ భ‌వ‌న్ ఇప్పుడు బీజేసీ, కాంగ్రెస్ పార్టీల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంది. అధికార పార్టీ పూర్తిగా దూరంగా ఉండిపోయింది. సీఎం కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్ సై మ‌ధ్య మాట‌లు కూడా లేవు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇటీవ‌ల ఆమె బ‌ర్త్ డే సంద‌ర్భంగా కేసీఆర్ విష్ చేయ‌డం గ‌మ‌నించ‌ద‌గ్గ అంశం.

తెలంగాణ సీఎం కేసీఆర్ ప‌రిపాల‌న‌లోని అవినీతి మీద ప్ర‌స్తుతం మూకూమ్మ‌డి దాడి జరుగుతోంది. విప‌క్ష నేత‌లు, కేంద్రంలోని బీజేపీ అగ్ర‌జులు ఎప్ప‌టిక‌ప్పుడు కేసీఆర్ జైలుకు అంటూ చెబుతున్నారు. తాజాగా కేఏ పాల్ సీబీఐకి 9ల‌క్ష‌ల కోట్ల అవినీతి జ‌రిగిందని కొన్ని ఆధారాల‌ను అందించారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో గ‌వ‌ర్న‌ర్ తో స‌ర్దుకు పోవ‌డం బెట‌ర్ అనే ఆలోచ‌న‌కు కేసీఆర్ వ‌చ్చిన‌ట్టు ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ర్గాల వినికిడి. అందుకే, బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌మిళ సైకి శుభాకాంక్ష‌లు తెలిపార‌ని టాక్‌. ఇప్పుడు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా భుయాన్ ప్ర‌మాణ‌స్వీకారం కోసం రాజ్ భ‌వ‌న్ కు కేసీఆర్ రావ‌డం ద్వారా స‌యోధ్యకు మార్గం సుగ‌మ‌మం అవుతుంద‌ని భావిస్తున్నారు. అది ఎంత వ‌ర‌కు కార్యారూపం దాల్చుతుందో చూడాలి.