Site icon HashtagU Telugu

Telangana Ministers in Delhi : తెలంగాణ మంత్రుల ఢిల్లీ గేమ్

Telangana Ministers

Telangana Ministers

కేంద్ర మంత్రుల‌ను క‌ల‌వాలంటే..ముందుగా అపాయిట్మెంట్ తీసుకోవాలి. పైగా గ్రూప్ ఆఫ్ మినిస్ట‌ర్స్ వెళ్లేట‌ప్పుడు ఇంకా ప‌గ‌డ్బంధీగా అపాయిట్మెంట్ ను ఫిక్స్ చేసుకుని ఢిల్లీ వెళ్లాలి. ఆయా రాష్ట్రాల సీఎంలు సైతం ప్ర‌ధాన మంత్రి, కేంద్ర మంత్రుల‌ను క‌ల‌వ‌డానికి ప్ర‌త్యేక‌మైన ప్రొటోకాల్ పాటించాలి. ఇవేమీ లేకుండా తెలంగాణ మంత్రులు ఢిల్లీ వెళ్లారు. అక్క‌డ కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రిని క‌లిసి వ‌రి ధాన్యం కొనుగోలుపై తాడోపేడో తేల్చుకుంటామ‌ని హెచ్చ‌రించారు. రెండు రోజుల క్రితం వెళ్లిన గ్రూప్ ఆఫ్ మినిస్ట‌ర్స్ అక్క‌డే ఉన్నారు.కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి అపాయిట్మెంట్ ఇవ్వ‌లేద‌ని తెలంగాణ మంత్రులు ఢిల్లీ నుంచి రాజ‌కీయ అస్త్రాల‌ను సంధిస్తున్నారు. బీజేపీ తెలంగాణ నేత‌ల‌తో పాటు కేంద్రాన్ని టార్గెట్ చేశారు. క్షేత్ర స్థాయిలో ఊరూరా నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌ను టీఆర్ఎస్ చేస్తోంది. ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌జా ప్రతినిధులు నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని అధిష్టానం ఆదేశించింది.
హుజురాబాద్ ఫ‌లితాలు వ‌చ్చిన వెంట‌నే వ‌రి ధాన్యం కొనుగోలు అంశాన్ని టీఆర్ఎస్ తెర‌మీద‌కు తీసుకొచ్చింది. కేంద్రం వాల‌కాన్ని నేరుగా సీఎం కేసీఆర్ మీడియా ముఖంగా దుయ్య‌బ‌ట్టాడు. ఆ సంద‌ర్భంగా కేంద్రాన్ని రాజ‌కీయంగా టార్గెట్ చేస్తాన‌ని హెచ్చ‌రించాడు. పార్ల‌మెంట్ వేదిక‌గా మోడీ స‌ర్కార్ ను నిల‌దీస్తామ‌ని ప్ర‌ణాళిక ర‌చించాడు. ఆ మేర‌కు రెండు రోజులు ప్ల కార్డుల‌తో టీఆర్ఎస్ ఎంపీలు పార్ల‌మెంట్లో క‌నిపించారు. అక‌స్మాత్తుగా పార్ల‌మెంట్ ను విడిచిపెట్టి హైద‌రాబాద్‌కు రావ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది.

వ‌రి ధాన్యం కొనుగోలులోని నిజానిజాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డానికి బీజేపీ కూడా రంగంలోకి దిగింది. కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి పార్ల‌మెంట్ వేదిక‌గా ఎంతైనా వ‌రి ధాన్యం కొనుగోలు చేస్తామ‌ని చెప్పాడు. ఇచ్చిన హామీ మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం బియ్యాన్ని స‌ర‌ఫ‌రా చేయ‌లేక‌పోయింద‌ని లెక్క‌ల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టాడు. దీంతో కేంద్రంపై మ‌రింత ఒత్తిడి పెంచాల‌ని క్యాడ‌ర్‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశాడు.గ‌త వారం తెలంగాణ‌భ‌వ‌న్లో జ‌రిగిన ఎంపీలు,ఎమ్మెల్యే, మంత్రుల మీటింగ్ సంద‌ర్భంగా ర‌చించిన ప్ర‌ణాళిక ప్ర‌కారం మంత్రులు ఢిల్లీ వెళ్లారు. ఎమ్మెల్యేలు ఊరూరా నిరస‌న కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది. బీజేపీని టార్గెట్ చేస్తూ..టీఆర్ఎస్ ఆడుతోన్న పొలిటిక‌ల్ గేమ్ ర‌క్తిక‌డుతోంది. కానీ, గ‌తంలోపార్ల‌మెంట్ ను కాద‌ని హైద‌రాబాద్ వ‌చ్చిన ఎంపీల మాదిరిగా మంత్రులు తిరిగి రాకుండా ఉంటే చాల‌ని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తున్నారు.తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 42 లక్షల మెట్రిక్‌ టన్నుల టార్గెట్‌ ఇచ్చిందని తెలంగాణ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి చెబుతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, కొనుగోలు కేంద్రాల్లో మరో 12 నుంచి 15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉందని ఢిల్లీ నుంచి లెక్క‌లు వినిపిస్తున్నాడు. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన వరి ధాన్యం కొనుగోలు టార్గెట్ సోమ‌వారంతో పూర్తవుతుందని అంచ‌నా వేశాడు.ఇక వ‌ర్షంకాలం ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తుందో..కేంద్రం చెప్పాల‌ని మంత్రుల బృందం డిమాండ్ చేస్తోంది. ప్రొటోకాల్ ప్ర‌కారం అపాయిట్మెంట్ ఫిక్స్ కాకుండా వెళ్లిన మంత్రులు కేంద్రాన్ని బ‌ద్నాం చేయ‌డానికి సిద్ధం అయింది. ఫ‌లితంగా గల్లీ టూ ఢిల్లీ వ‌ర‌కు బీజేపీ, టీఆర్ఎస్ న‌డుమ ర‌క్తికడుతుంటే, తెలంగాణ రైతులు మాత్రం పిట్ట‌ల్లా రాలిపోవ‌డం బాధాక‌రం. ఇప్ప‌టికైనా రైతుల ప‌క్షాల ఇరుపార్టీలు నిల‌వాల‌ని ఆశిద్దాం.